దేశ వ్యాప్తంగా సత్తాచాటేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇకపై కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ముందుగా తెలంగాణ పొరుగు రాష్ట్రాలైనా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే త్వరలో రాబోయే కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తరుఫున కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. ఇదే విషయాన్ని మరోసారి బీఆర్ఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కర్ణాటక కలబురిగి జిల్లాలో జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె బీఆర్ఎస్కు జేడీఎస్ మద్దతు ఇవ్వడం ఎంతో సంతోషకరమన్నారు.
జేడీఎస్‌కు కూడా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కర్ణాటకాకు కుమార్ స్వామిని సీఎం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలిపారు. తమ నాయకుడుతో పాటు బీఆర్ఎస్ మంత్రులంతా జేడీఎస్ గెలపుకోసం కష్టపడతారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రూ. 2016 పింఛన్ ఇస్తుంటే కర్ణాటకలో మాత్రం రూ. 600 ఇస్తున్నారని సత్యవతి రాథోడ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతు పాలసీ, జలవిధానం తదితర నూతన పాలసీలను రూపొందించారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని, సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్కు మద్దతుగా నిలువాలని మంత్రి కోరారు. ఇక కర్ణాటకలో 2023 మేలోపు ఎన్నికలు జరుగుతాయి. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో జేడీఎస్‌తో కలిసి పోటీ చేయనుంది బీఆర్ఎస్.