ముచ్చటగా మూడే మూడేళ్లు..ఇంటికి మూడు ,నాలుగు గొర్రెల మందలు. ఈ మందలే గొల్లకురుమల గొప్ప సంపద. అదే వారిని ధనవంతల్ని చేయబోతోంది. రాబోయే మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల సంపదను గొల్లకురుమలు సృష్టించబోతున్నారా…ఇది సాధ్యమేనా…? పక్కాగా అమలు అవుతుందా..?
కోటిన్నర గొర్రెల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొండపాకలో డోల్ కొట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
ల్లకురుమల్లో ఒక్కో ఇంటికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తారు. 7 లక్షల 61 వేల దరఖాస్తులు వస్తే 7 లక్షల 18 వేల మందికి గొర్రెలు మంజూరయ్యాయి. ప్రతి రోజు 650 లారీల గొర్రెలు హైదరాబాద్‌కు వస్తున్నాయి. తెలంగాణలో 35 లక్షల గొల్లకురుమలున్న రాష్ట్రంలో 650 లారీల గొర్రెలను దిగుమతి చేసుకోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు సీఎం కేసీఆర్. 650 లారీలను దిగుమతి చేసుకోవడం కాదు.. ప్రతీ రోజు ఆరు వేల లారీల గొర్రెలను ఎగుమతి చేసే స్థాయికి పోవాలన్నారు. నేడు పంపిణీ చేసిన గొర్రెలు.. రెండున్నర ఏళ్లలో మూడు ఈతల్లో ఏడున్నర కోట్ల గొర్రెలు అవుతాయని చెప్పారు.
మూడేళ్ల తర్వాత దేశంలోనే..అత్యంత ధనవంతులైన యాదవులు తెలంగాణలోనే ఉంటారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. గొర్రెలపై రూ. 25వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. గొర్రెల పెంపకం కూడా నైపుణ్యం ఉన్న పనేనని, సాగు యోగ్యం లేని భూములను గొర్రెల మేతకు కేటాయిస్తామని చెప్పారు.1948-56 మధ్య కాలంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని నాడు వేల ఉద్యమ సభల్లో చెప్పానని గుర్తు చేశారు. నాడు తాను చెప్పింది.. నేడు నిజమైందన్నారు. 2020 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. గొర్రెలకు వైద్య సహాయం కోసం 1962 నంబర్ ను ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌కు కాల్ చేస్తే మంద దగ్గరకే వైద్యులు మందులు తీసుకువస్తారు. ఏడాదికి 3 సార్లు క్రమం తప్పకుండా నట్టల మందు, టీకాలు వేయనున్నారు.
నిజంగా అనున్నది అనుకున్నట్లుగా గొల్లకురుమలు అత్యంత ధనవంతులు కావడం పక్కా..క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు సమర్ధవంతంగా జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఏదో నామ్ కే వాస్తీ గా సంచార వైద్యశాలలుంటే కష్టమే. గొర్రెల పెంపకం ఈజీయే గానీ వాటికి జబ్బు చేస్తే బతికించుకోవడమే కష్టం. టైమ్ కి వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉండాలి. అప్పుడే గొల్లకురుమల గొప్ప సంపద సిరులు పండిస్తోంది.