"జీఎస్టీలో బీడీలు వద్దు" - MicTv.in - Telugu News
mictv telugu

"జీఎస్టీలో బీడీలు వద్దు"

June 15, 2017

బీడీలంటే కేంద్ర ప్రభుత్వాలకు అస్సలు నచ్చడం లేనట్టుంది. ఎట్ల తాగేది లేదనుకున్నారో కాంగ్రెస్సోళ్లేమో పుర్రె గుర్తు వేసి బీడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేశారు. ఇప్పుడు బీజేపీ సర్కార్ జీఎస్టీ పోటు తప్పదంటోంది. బీడీ కార్మికులకు అన్యాయం చేస్తుంటే..ఊరుకుంటారా ఏంటీ మన సీఎం కేసీఆర్ ..లేఖను రాయనే రాశారు ప్రధానమంత్రి మోదీకి. అందులో ఏముందంటే…

బీడీ పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, మిషన్ భగీరథ పనులు, నీటి పారుదల ప్రాజెక్టుల పనులను జీఎస్టీ నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కేంద్రాన్ని కోరారు.

ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి
లేఖలు రాశారు.

రాష్ట్రంలో వేలాది మంది బీడీలు చుట్టి బతుకుతున్నారని, బీడీ పరిశ్రమపై అధిక పన్నులు వేయడం వల్ల వారి ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 2వేలకు పైగా గ్రానైట్ యూనిట్లు ఉన్నాయని వివరించారు. వీటిలో 2 లక్షల మంది ప్రత్యక్షంగా, ఐదు లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు.

గ్రానైట్/మార్బుల్ రా బ్లాక్స్ పై 12 శాతం, ఫినిష్ చేసిన ఉత్పత్తులపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇంత ఎక్కువ పన్ను వేయడం వల్ల గ్రానైట్ పరిశ్రమ దెబ్బతిని లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు.
రా బ్లాక్స్, ఫినిష్డ్ ఉత్పత్తులు… రెండింటిపై పన్ను 12 శాతానికే పరిమితం చేయాలని కేంద్రాన్ని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం మిషన్ భగీరథ, రైతులకు సాగునీరు అందించడం కోసం నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

ప్రజల కోసం ప్రభుత్వం తరుఫున జరుగుతున్న ఈ పనులపై అత్యధిక జీఎస్టీ విధించడం భావ్యం కాదని, పునరాలోచించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.
తాము చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాలని, ఈ నాలుగు అంశాల్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లు తమ రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశం మొత్తం మీద ఒకే పన్ను విధానం ఉండేందుకు జీఎస్టీ అమలు చేయడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ప్రతిపాదన దశ నుంచి అమలు దశ వరకు దేశంలోని రాష్ట్రాలను కలుపుకుని పోయిన విధానంపై సిఎం కేంద్రానికి అభినందనలు తెలిపారు.కానీ ఆ నాలుగింటిని జీఎస్టీ నుంచి మినహాయించాలని కేసీఆర్ కోరారు.

మరోవైపు బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. జీఎస్టీ నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని నిజామాబాద్ లో వేలాది మంది కార్మికులు రోడెక్కారు. లేకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు.