సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని, నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించుకోవడం సంతోషమని చెప్పారు. ఏ తెలంగాణ కోసమైతే పోరాటం చేశామో.. ఆ దిశగా సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నామన్నారు. వేదనలు, రోదనలతో బాధపడిన పాలమూరు జిల్లా నేడు సంతోషంగా ఉందని, సంక్షేమ పథకాల్లో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉందని చెప్పారు.
“ఏ తెలంగాణ కోరుకున్నామో అది సాకారమవుతోంది. అద్భుతమైన ప్రయాణంలో మనం సాగుతున్నాం. ఇది సాధించామనే సంతృప్తి జీవితంలో చాలా ముఖ్యం. ఒకప్పుడు పీవీ నర్సింహారావు ఏర్పాటు చేసిన సర్వేల్ గురుకుల పాఠశాల అందరికీ గర్వకారణం. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక చిన్న గ్రామంలో 127 మందిలో కంటిచూపు సమస్య ఉంది. కంటి వెలుగు పథకం వెనక ఎంతో పరమార్థం ఉంది. అధికారులు అంకితభావంతో కంటివెలుగును విజయవంతం చేయాలి. ఏ పథకం తెచ్చినా.. సమగ్ర చర్చ, ఒక దృక్పథం ఉంటుంది. మహిళలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆర్థిక, సామాజిక సమస్యలు ఉంటాయి. కేసీఆర్ కిట్ పథకం కూడా ఆషామాషీగా తెచ్చింది కాదు. గర్భిణీగా ఉన్నప్పుడు ఆదాయం కోల్పోతారనే డబ్బు కూడా ఇస్తున్నాం. టీకాలను నిర్లక్ష్యం చేయొద్దనే టీకాలు వేయించినప్పుడు డబ్బులు ఇస్తున్నాం. సామాజిక, మానవీయ దృక్పథంతో పథకాలు తెస్తున్నాం. సంస్కరణలు నిరంతర ప్రక్రియ, ఒక దశతో ముగిసేవి కావు. మన రాష్ట్రం చిమ్మచీకటవుతుందని శపించిన వాళ్లూ ఉన్నారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అద్భుతప్రగతి సాధిస్తున్నాం. ఈ 8 ఏళ్లలో అందించిన సహకారం భవిష్యత్‌లోనూ కొనసాగాలి” అని అన్నారు సీఎం.
ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నాము. గతంతో భయంకరమైన కరెంట్ బాధలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.