వరదలతో గోదావరి భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం 70 అడుగులకు చేరుకోవడంతో పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి. దీంతో చాలా మంది ట్రాక్టర్లు, ఇతర రవాణా సాధనాలలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. భద్రాచలం వంతెనపై రాకపోకలను నిషేధించడంతో మూడు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్లను భద్రాచలానికి పంపాలని ఆదేశించారు. సహాయచర్యలను వేగవంతం చేయాలని, అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలని సూచించారు. అలాగే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. కాగా, 1986 ఆగస్టులో గోదావరిలో నీటి మట్టం 75 అడుగులకు చేరింది. ఇప్పటివరకు ఇదే రికార్డు కాగా, వరద ఇదే స్థాయిలో కొనసాగితే శుక్రవారం రాత్రికి నీటి మట్టం 73 నుంచి 75 అడుగులకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు ఉపనదులైన శబరి, ప్రాణహితల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. వరద ఇంకా పెరిగితే భద్రాద్రి రామాలయంలోకి నీరు చేరే ప్రమాదం ఉంది.