CM KCR's sensational comments on central investigation agencies
mictv telugu

కేంద్ర దర్యాప్తు సంస్థలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

September 1, 2022

కేంద్ర దర్యాప్తు సంస్థలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ లాంటి సంస్థలు రాష్ట్రంలో చొరబడడం సరికాదని వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బుధవారం పాట్నాలో బీహార్‌ సీఎం నితీశ్‌ కమార్‌తో భేటీ అనంతరం కేసీఆర్‌ జాతీయ మీడియాతో మాట్లాడారు. సీబీఐని బిహార్లోకి అనుమతించకపోవడంపై సీఎం కేసీఆర్ సమర్ధించారు. దేశంలోని ప్రతీ రాష్ట్రం ఇదే చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని ఆయన అన్నారు. సీబీఐ లాంటి సంస్థలు రాష్ట్రాల్లోకి చొరబడటం కరెక్టు కాదని తెలిపారు.

బీహార్‌లో అధికారంలో ఉన్న మహా కూటమి నేతలు సైతం ఇదే తరహా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1946 సెక్షన్‌ ప్రకారం.. ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు నిర్వహించాలంటే సీబీఐ ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్రాలు తమ సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటే ఆ రాష్ట్ర పరిధిలో ఏదైనా కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మేఘాలయ సహా 9 రాష్ట్రాలు ఈ తరహా సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వం సైతం సమ్మతిని ఉపసంహరించుకుంది.

కేసీఆర్ మాటలను బట్టి.. పరిస్థితులు మారితే తెలంగాణ రాష్ట్రం కూడా సీబీఐ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలను సీఎం కేసీఆర్ ఇచ్చారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక 2019 ఎన్నికలకు ముందు అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది. సీబీఐ రాష్ట్రంలోకి రావాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై అరోపణలు వచ్చాయి.