CM KCR's speech at the TRS public meeting held at Bangarigadda.
mictv telugu

‘గాడిదలకు గడ్డేస్తే.. ఆవులకు పాలు రావ్‌’

October 30, 2022

ప్రధాని నరేంద్ర మోదీ మద్ధతు లేకుండానే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు హైదరాబాద్ వచ్చారా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. చంచల్ గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆ నిందితులకు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చండూరు వేదికగా నిలదీశారు. ఈ అరాచకానికి కారణమైన వారు తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు.

“నరేంద్ర మోదీ.. నేను అడుగుతున్నా.. నీకు ఇంకా ఏం కావాలి? దేశంలో ప్రధాని పదవిని మించి పదవి ఇంకా లేదు కదా. ఒకసారి కాదు రెండుసార్లు అవకాశం వచ్చింది కదా? ఎందుకు ఈ కిరాతకం. ఎందుకీ అరాచకం. దేశం కోసం, సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నరు. మోదీ అండదండలు లేకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉన్నరు” అని వ్యాఖ్యానించారు సీఎం.

‘‘చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోదీ. కేంద్రానికి బుద్ధి రావాలంటే చేనేత కుటుంబాలు బీజేపీకి ఒక్క ఓటు వేయొద్దు. విద్యుత్‌ సంస్కరణల ముసుగులో మీటర్లు పెట్టాలని కేంద్రం చూస్తోంది. బీజేపీకి ఓటేస్తే.. విద్యుత్‌ చట్టాలకు అంగీకరించినట్లే. బీజేపీకి డిపాజిట్‌ వచ్చినా.. నన్ను పక్కకు నెట్టేస్తారు’’ అని కేసీఆర్‌ అన్నారు.

“ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసే టప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డేసి.. ఆవులు పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదికి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు