అమాయకులతో సీఎం భేటీ.. అశ్వత్థామరెడ్డి ఆరోపణ - MicTv.in - Telugu News
mictv telugu

అమాయకులతో సీఎం భేటీ.. అశ్వత్థామరెడ్డి ఆరోపణ

November 30, 2019

అమాయకులతోనే సీఎం బేటీ నిర్వహిస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. అధికారులతో కాకుండా ప్రశాంత వాతావరణంలో ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి డిపో నుంచి ఐదుగురు సీనియర్ కార్మికులను పిలిపించుకుని వారితో భోజనం చేసి, చర్చలు జరుపుతానని కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. ఆర్టీసీ కార్మికులతో రేపు జరిగే సమావేశంలో 26 డిమాండ్లపై చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుని కార్మికులను ఆదుకోవాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. 

Aswaththama Reddy.

హైదరాబాద్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ, విపక్ష పార్టీల నేతలతో సమావేశమైంది. ఈ సందర్భంగా అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ‘డిపోల్లోని అమాయకులను సీఎం సమావేశానికి పంపిస్తున్నారు. సెక్షన్‌ 19 ప్రకారం ఎవరైనా ట్రేడ్‌ యూనియన్‌ పెట్టుకోవచ్చు. రాజ్యాంగం ప్రకారం కార్మిక సంఘాలు నడుస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం కోర్టు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఇటీవల మరణించిన ముగ్గురు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పొన్నాల ఫౌండేషన్‌ నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నారు. వివిధ సంఘాలు, బ్యాంకు అధికారులు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. సమ్మెకు సహకరించిన రాజకీయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు’ అని అశ్వత్థామరెడ్డి తెలిపారు.  

ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డితో పాటు కో-కన్వీనర్‌ రాజిరెడ్డి, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.