CM responds on proposal to divide Karnataka in two states
mictv telugu

కర్ణాటక రెండు ముక్కలు కానుందా? సీఎం స్పందన ఇదీ

June 25, 2022

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కానున్నాయనీ కర్ణాటక కూడా రెండు రాష్ట్రాలుగా ఏర్పాటవుతుందని ఆరాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంతేకాక, ఆ దిశగా ప్రధాని మోదీ చర్చలు జరుపుతున్నారని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మనం ఉత్తర కర్ణాటక కోసం పోరాడాలని మంగళూరులో ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య ‘ఇది చాలా ప్రమాదకరం. రాష్ట్రాన్ని విడగొట్టాలనే ప్రయత్నం ప్రధానమంత్రి స్థాయిలో జరుగుతోందని మంత్రి మాటలను బట్టి అర్ధమవుతోంది. దీనిపై పీఎం, సీఎం కార్యాలయాలు స్పందించాలి’ అని ట్వీట్ చేశారు. తాజాగా ఈ అంశంపై సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ‘రాష్ట్రాన్ని విడగొట్టే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదు. మంత్రి అలా మాట్లాడడం కొత్తకాదు. ప్రత్యేక రాష్ట్రం అంటూ ఆయన ఇప్పటికే వంద సార్లు మాట్లాడి ఉంటారు’ అని తేలిగ్గా తీసిపారేశారు.