CM Shivraj made a big announcement giving seven days additional leave to women employees
mictv telugu

మహిళా ఉద్యోగులకు ఏడు రోజుల అదనపు సెలవులు.!!

March 9, 2023

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళలకు భారీ కానుక ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ఏడు రోజుల అదనపు సెలవులు ఇస్తున్నట్లు సీఎం చౌహాన్ బుధవారం ప్రకటించారు. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం, సీఎం శివరాజ్‌ పలు ట్వీట్లు చేశారు. తల్లి, సోదరి, కుమార్తెల అభ్యున్నతే తన జీవిత ప్రధాన ధ్యేయమన్నారు. మహిళా శక్తి సాధికారతలోనే రాష్ట్ర, దేశ ఉద్ధరణ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ రోజు మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉన్నాయి. అయితే మాతృత్వం, ఇంటి సంరక్షణ బాధ్యత కూడా వారిపై ఉందని సీఎం అన్నారు. అందుకే మేము మహిళా ఉద్యోగులందరికీ 7 రోజుల అదనపు క్యాజువల్ లీవ్ (CL) ఇవ్వాలని నిర్ణయించాము, దానిని వారు వారి అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవచ్చని శివరాజ్ ట్వీట్ చేశారు. ఈ అదనపు సెలవుతో, సోదరీమణులు అభ్యున్నతి కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు చౌహాన్ తన ట్వీట్‌లో తెలిపారు. 10వ తరగతి తర్వాత హయ్యర్‌ సెకండరీ, కళాశాలల్లో ఆర్థిక అక్షరాస్యత కోసం పాఠాలు చెబుతామని, మహిళా ఆధారితంగా తీర్చిదిద్దుతామన్నారు. బాలికలకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని, ఇందులో చేనేత, ఎంబ్రాయిడరీ, సంప్రదాయ జానపద కళల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు.

సీఎం నిర్ణయంపై ఆ రాష్ట్ర మహిళలు హర్షం వ్యక్తం చేశారు. మంచి మనస్సున్న సీఎం అంటూ ధన్యవాదాలు తెలిపారు.