ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ)లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని అనుమతి లేకుండా ప్రదర్శించడం పెద్ద గొడవకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ అనుబంధం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) చేసిన పనులతో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెరియార్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే మొదలైన వారి ఫోటోలను ఏబీవీపీ వర్గానికి చెందిన కొందరు ధ్వంసం చేయడమే ఇందుకు కారణమని వామపక్ష విద్యార్థి విభాగం(ఎస్ఎఫ్ఐ), జెఎన్‌యూ విద్యార్థి సంఘం సోమవారం ఆరోపించింది. ఇందుకు అడ్డొచ్చిన తమిళ విద్యార్థులపై కూడా వారు దాడికి పాల్పడడమనేది ప్రధాన ఆరోపణ. ఇది ఏబీవీపీ పనే అని జెఎన్‌యూఎస్యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ కూడా ట్వీట్ చేశారు. క్యాంపస్ లో ఏబీవీపీ మతసామరస్యానికి భంగం కలిగిస్తోందని ఆరోపించింది.
ఈ చర్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఖండించారు. తమిళ విద్యార్థులపై దాడులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, తమిళ విద్యార్థులకు రక్షణ కల్పించాలని వైస్ ఛాన్సలర్‌ను అభ్యర్థించారు. జెఎన్‌యూలో పెరియార్, కార్ల్ మార్క్స్ వంటి నాయకుల చిత్రాలను ధ్వంసం చేయడం, తమిళ విద్యార్థులపై ఏబీవీపీ దాడి చేయడం పిరికిపంద చర్య అని, అత్యంత ఖండనీయమని, యూనివర్శిటీ అడ్మిన్ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని స్టాలిన్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఆదివారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటాన్ని అపవిత్రం చేయడం వెనక వామపక్ష విద్యార్థి సంఘం విద్యార్థులు ఉన్నారని.. ఏబీవీపీ ఆరోపించింది.