తాగిన మైకం దిగకుండానే గురుద్వారాలో ప్రవేశించారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నెల 14న జరిగిన వైశాఖి సందర్భంగా ఈ ఘటన జరిగిందని తెలిపింది. దీనిపై సీఎం క్షమాపణలు చెప్పాలంటూ కమిటీ డిమాండ్ చేసింది. మరోవైపు బీజేపీ యువనేత తేజీందర్ పాల్ సింగ్ డీజీపీకి శనివారం ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో గురుద్వారాలో ప్రవేశించిన సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంపై చేసిన ఫిర్యాదు ప్రతులను తేజీందర్ పాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఇటీవలే ఆప్ పార్టీ తరపున పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.