పరవశించిన పదాలు ! - MicTv.in - Telugu News
mictv telugu

పరవశించిన పదాలు !

June 12, 2017


తెలుగునేల సొమ్మసిల్లిన రోజు, తెలుగు ఖ్యాతి వన్నెతగ్గిన రోజు, సాహిత్య, సాంస్కృతిక లోకంలో ఒక తార దిగంతాలకెగిసిన రోజు, తెలుగు పాట వన్నెలు కోల్పోయిన రోజు, అక్షరాలు ఆ పాళిలో ఒలకలేని ధీనావస్థ పడుతున్న దురదృష్టకరమైన రోజు, తెలుగు సినిమా రంగం కళను కోల్పోయిన రోజు, కళారంగం కళావిహీనమైన రోజు, కలాలు ఏకమై ముక్తకంఠంతో రోధిస్తున్న రోజు, చరిత్రలో కన్నీటి కుసుమాలతో సదా వీడ్కోలు రాసుకునే రోజు.., బురా దిన్, పహాడ్ జైసే బడే ఆద్మీకో ఛీన్ లియా జఖ్మీ దిన్ ??ప్రముఖ కవి, గేయ రచయిత సింగిరెడ్డి నారాయణ రెడ్డి పరమపదించడం ఎవరూ తీర్చలేని లోటు..

సినారె

‘ నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని ’ ఈ ఒక్క పాట చాలు అందరి మదిని దోచుకొని ఆయన చిరస్థాయిగా ప్రేక్షకులు గుండెల్లో నిలిచిపోవడానికి, ఒదిగిసోవడానికి నిదర్శనం ! మహోన్నత వ్యక్తిత్వానికి నిలువుటద్దం, శృతి లయలు అప్పుడప్పుడు గతి తప్పుతున్నప్పుడు వాటికి ఆయన అక్షరాలతో నడకలు నేర్పి, కమ్మని పాటలో, తియ్యని కవితలో ఒదిగేలా చేసిన అక్షర వీరుడు, తెలగు భాషకు ప్రీతి పాత్రమైన సుమనోహర సుపుత్రుడింక తన సాహితీ సేవలకు ఫుల్ స్టాప్ పెట్టడం అనేది ఎవరూ జీర్ణించుకోలేని విషాదం ?

సినారె హృదయం 

సినారె గొప్ప సహృదయతను కలిగిన వాడని ఆయన దెగ్గర శిష్యరికం చేసిన ప్రియ శిష్యుల్లో ముందుండే డాక్టర్ ఎన్ గోపి గారు చెప్తారు. నాకు ఆయన నాన్నతో సమానం.  నేను కవిత్వం రాయడం ఎలాగో, కవిత్వ నిర్మాణం, గాఢత, వుపయోగం.., గురించి ఎంతో విపులంగా చెప్పి ఒకటికి పది సార్లు రాయించేవారు. ఎందరో నాలాంటి కవులను తీర్చిదిద్దిన గొప్ప మహానుభావుడు. నాకు దేవుడంతటి వాడు. ఆయన మరణాన్ని నేనెప్పటికీ నమ్మను.

విశ్వంభర విలాసం

తెలుగులో జ్ఞానపీఠ్ అవార్డుని తీస్కొచ్చిన ముగ్గురు తెలుగువాళ్ళలో ఒక్క తెలంగాణా వాడిగా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని నిలిపిన అక్షర కృషీవలుడు ఆయన.మొదటిసారి ‘ వేయి పడగలు ’ పుస్తకానికి గాను విశ్వనాథ సత్యనారాయణకు, రెండవసారి డాక్టర్ సి. నరాయణ రెడ్డి రాసిన ‘ విశ్వంభర ’ కావ్యానికి గాను 1988 సంవత్సరంలోనే జ్ఞానపీఠ్   పురస్కారం వరించింది. మూడవసారి ‘ పాకుడురాళ్ళు ’ పుస్తకానికి గాను రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ్ వచ్చింది.కవిగా, రచయితగా, సృజనకారుడిగా రాణించాలనుకునేవారు తప్పకుండా కళ్ళకద్దుకొని మరీ చదివి దాచుకోవాల్సిన గొప్ప మార్గదర్శక పుస్తకం విశ్వంభర.

 తనకు సాటి రారెవ్వరు 

కరీంనగర్ జిల్లా, హనుమాజి పేట అనే మారుమూల గ్రామంలో 1931 జూలై 29 న జన్మించిన ఆయన ఎన్నో మైలురాళ్ళను దాటుకొనొచ్చిన ఎనలేని సాహితీకారుడు. బచ్ పన్ నుండే హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడైన సూక్ష్మ పరిశీలకుడాయన. ఎన్నో పుస్తకాలను ఔపోసన పట్టారు. అందుకే ఆయన ఒక నిరాడంబర, నిఖార్సైన కవిగా, సృజనకారుడిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు గఢించారు. కవిత్వం, పద్యం, గేయ నాటికలు, గజల్, వ్యాసం, విమర్శనా గ్రంథాలు, అనువాదాలు.., వంటివి దేన్ని సృజించిన ఆయన స్టైల్ ఒక డిఫరెంటు. తెలుగులో గజళ్ళ ఒరవడిని తీస్కొచ్చిన మొట్ట మొదటి కవి ఆయనే. ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడం వల్ల ఆయనకు ఉర్దూ భాష మీద మంచి పట్టుంది. అందుకే గజళ్ళను కూడా తెలుగులో సుందరంగా రాయొచ్చని నినదించిన గొప్పవాడు. కవిగానే కాదు, సినీ గేయ రచయితగా, తెలుగు యూనివర్సిటీ ఆచార్యులుగా, రాజ్యసభా సభ్యుడిగా.., ఇలా ఆయన ఏది చేబట్టినా దానికే వన్నె వచ్చేది. లెక్కలేని ఎన్నో, ఎన్నెన్నో పురస్కారాలు ఆయన తలుపు తట్టాయి. అవన్నీ చంద్రునికో నూలుపోగులాంటివి మాత్రమే.

చివరి వరక్కూడా ఆయన కలం నిర్విరామంగా రాస్తూనే వుంది. వివిధ పత్రికలలో లెక్కకు అందని ఎన్నో కవితలు అచ్చయినాయి. కవిత్వంలో గానీ, పాటలో గానీ దాని సొగసుకి భంగం కలగకుండా చాలా లోతైన భావంతో రాసేవారు. ఆయన చేత పాటలు రాయించుకోవాలని ఎందరో దర్శకులు ఆయన ఇంటి ముందు క్యూలు కట్టేవారట. ఆయన కలం నుండి జాలువారిన పాటలు అజరామరం. తెలగు భాష వున్నంత వరకు ఆయన ఖ్యాతి నిలిచి వుంటుంది. ఆయన మనకు మిగిల్చి వెళ్ళిన అక్షర రాజసం ఎప్పటికీ చెరగని సంతకమై చరిత్రలో వెలుగుతూనే వుంటుంది ! సాహితీ లోకంలో ఆయన కలం నుండి జాలువారిన అక్షరాలు ఒక్కొక్కటీ వినమ్రంగా విరాజిల్లుతూనే వుంటాయి !!

సిసలైన తెలంగాణ జెమ్

దమ్ దార్ తెలంగాణ వాడిగా తెలుగు సినిమా జగత్తును విశ్వవ్యాప్తం చేసిన అమరజ్యోతిగా నిలిచిపోతాడాయన. కాకపోతే ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తన మద్దత్తు తెలపలేదనే విమర్శలున్నాయి. తొలిదశ తెలంగాణ ఉద్యమమప్పుడు ‘ తెలుగు జాతి మనది నిండుగువెలుగుజాతి మనది ’ అనే పాట రాసి అప్పటి ఉద్యమ స్ఫూర్తిని నీరుగార్చానే విమర్శలు బలంగా వినిపించాయి. అనేక తెలంగాణ సాహితీ సంస్థలు ఆహ్వానించినా చల్లగా తిరస్కరించేవారనే వాదనలు కూడా వున్నాయి. తెలంగాణ సాకారమయ్యే చివరి రోజుల్లో AV కాలేజీకొచ్చి నాలుగు మాటలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని తెలంగాణ వాదులు చెప్తున్న మాట. ఏది ఏమైనా ఆయన మన తెలంగాణ బిడ్డ. దివంగత మాజీ ప్రధాని పీవి. నరసింహారావు ఆయన ఒకే జిల్లా వాళ్ళు అవడం యాదృచ్చికం.

Evergreen songs లో కొన్ని

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని ( గుళేబకావళి కథ )

వగలరాణివి నీవే సొగసు కాడను నేను ( బంధిపోటు )

తెలిసిందిలె నెలరాజ నీరూపు తెలిసిందిలె ( రాముడు భీముడు )

గున్నమామిడీ కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ( బాల మిత్రులు కథ )

వస్తాడు నారాజు ఈ రోజు ( అల్లూరి సీతారామరాజు )

గోగులు పూచె పూగులు కాచె ఓ లచ్చా గుమ్మాడి ( ముత్యాల ముగ్గు )

లాలీ లాలీ లాలి లాలీ ( స్వాతి ముత్యం )

అమ్మను మించి దైవమున్నదా ( 20 వ శతాబ్దం )

కంటేనె అమ్మ అని అంటే ఎలా ( ప్రేమించు )

జేజమ్మా జేజమ్మా ( అరుంధతి )

– సంఘీర్