కొన్ని విషాదాల్లో నమ్మశక్యం కాని విషయాలు బయటపడుతుంటాయి. ఆదివారం ఘోర ప్రమాదానికి గురైన యతి ఎయిర్లైన్స్ ఘటనలో ఇలాంటివే వెలుగు చూస్తున్నాయి. ఈ విమానానికి కోపైలెట్ గా వ్యవహరించి, ప్రయాణికులతోపాటు అసువులు బాసిన అంజు ఖడివాటా విషాదగాథ ఇలాంటిదే. కోపైలెట్ అయిన ఆమె భర్త కూడా 16 ఏళ్ల కిందట ఇలాంటి ప్రమాదంలో చనిపోయాడు. ఇప్పుడు ఆమె కూడా ప్రమాదంలోనే చనిపోవడంతో కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. అంజు ఖడా యతి ఎయిర్ లైన్స్ ఏటీఆర్ 72 విమానానికి కోపైలెట్. ఆమె ఇప్పటివరకు నేపాల్లోని అన్ని ఎయిర్ పోర్టుల్లో విమానాలను సురక్షితంగా దింపారు. ఆదివారం నాటి విమానాన్ని కూడా ల్యాండ్ చేసి వుంటే 100 గంటలపాటు విమానం నడిపిన అనుభవం పూర్తయి పైలెట్ లైసెన్స్ పొందివుండేవారు. మరికొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ అవాల్సి ఉండగా ప్రమాదం జరిగింది. అంజు భర్త దీపక్ పోఖ్రేల్ 2006 జూన్ లో యతి ఎయిర్ లైన్స్ విమానానికే కోపైలెట్ గా వ్యవహరిస్తూ ప్రమాదంలో చనిపోయారు. తాజా ప్రమాదంలో 72 మంది చనిపోగా, దీపక్ విమానంలో పదిమంచి చనిపోయారు.