దేశంలో బొగ్గు కొరత.. రైళ్లు నిలిపివేత - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో బొగ్గు కొరత.. రైళ్లు నిలిపివేత

April 29, 2022

దేశాన్ని ప్రస్తుతం బొగ్గు కొరత వేధిస్తుంది. ఈ కొరత కారణంగా దేశ రాజధాని ఢిల్లీ సతమతమవుతుంది. ఈ విషయంపై ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖలో ఆసుపత్రులు, మెట్రోకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, వెంటనే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఢిల్లికి విద్యుత్‌ను అందించాలని పేర్కొంది.

ఈ సమస్యపై విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం ఢిల్లీలో అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..”విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరిపోనూ బొగ్గు నిల్వలను కేంద్రం పంపించాలి. దాద్రి 2, ఉంఛార్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అయిపోయాయి. ఆ కారణంగానే ఢిల్లీలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. 25 నుంచి 30 శాతం వరకు ఈ రెండు విద్యుత్ కేంద్రాలే ఢిల్లీ అవసరాలను తీరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. వీలైనంత వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తాం” అని ఆయన అన్నారు.

అనంతరం విద్యుత్ సంక్షోభంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ..”సంక్షోభ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ సంక్షోభం నుంచి ఢిల్లీతోపాటు, రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం బయటపడేయాలి” అని కేంద్రాన్ని ఆయన కోరారు.

మరోపక్క దేశవ్యాప్తంగా బొగ్గు రవాణాను పెంచేందుకు ఈరోజు 42 ప్యాసింజర్ రైళ్లను రైల్యేశాఖ అధికారులు రద్దు చేశారు. వచ్చే నెల మరిన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసేందుకు అధికారులు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా కొడుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. బొగ్గు ఉత్పత్తి సరిగా లేకపోవడంతో అనేక చోట్ల కరెంట్ కోతలు మొదలైయ్యాయి.

రోజురోజుకు థర్మల్ విద్యుద్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటిపోతున్నాయి. దేశం విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయే ముప్పు ఆసన్నమైందని ఆలిండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ హెచ్చరించింది. బొగ్గు కొరతపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. విద్యుదుత్పత్తికి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్యాసింజర్ రైళ్లకు బదులు బొగ్గు రవాణా కోసం ఎక్కువ రైళ్లను నడపాలని కేంద్రం నిర్ణయించింది. కానీ తాజా పరిస్థితులను చూస్తుంటే మరికొన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం కన్పిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.