తప్పించుకుని.. తిండీనీళ్లూ లేక అల్లాడిన భారతీయులు - MicTv.in - Telugu News
mictv telugu

తప్పించుకుని.. తిండీనీళ్లూ లేక అల్లాడిన భారతీయులు

November 30, 2019

ఉపాధికోసం యెమెన్ వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది భారతీయులు శుక్రవారం సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. తీరప్రాంత గస్తీదళం చొరవతో మత్స్యకారులు క్షేమంగా చేరుకున్నట్టు అధికారులు  తెలిపారు. యెమెన్‌లో ఉపాధి కోసం వెళ్లిన మత్స్యకారులు యజమాని వేధింపులు తాళలేక చేపల వేటకు వెళ్లే పడవలో పారిపోయారని, వీరిని తీరప్రాంత గస్తీదళం కాపాడిందని రక్షణశాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

Yemen.

వీరిలో ఏడుగురు తమిళనాడు, ఇద్దరు కేరళకు చెందినవారని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘యెమెన్‌లోని ఓ వ్యాపారి వద్ద వీరు చేపల వేటకు చేరారు. యజమాని వీరికి సక్రమంగా జీతాలు ఇవ్వకపోగా, ఆహారం, వసతి లాంటి కనీస అవసరాలను కల్పించకుండా వేధించాడు. దీంతో వారు తమను తాము కాపాడుకోడానికి అక్కడ నుంచి పారిపోయి వచ్చారు. వారు సముద్రంలో ప్రమాదంలో ఉన్నారని కన్యాకుమారిలోని దక్షిణాసియా మత్స్యకారుల సంఘం ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. వారి సమాచారంతో కోస్ట్‌గార్డులను అప్రమత్తం చేశాం. కోస్ట్‌గార్డ్ సిబ్భంది కన్యాకుమారి జిల్లాలోని ఓ మత్స్యకారుడి భార్యను సంప్రదించారు. నవంబరు 27 ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తన భర్త ఫోన్‌ చేశాడని, అప్పటికి లక్షద్వీప్‌లో ఉన్నట్టు తెలిపినట్టు ఆమె ద్వారా తెలుసుకున్నారు. కోచి తీరానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే బోటులో ఇంధనం చాలా తక్కువ ఉందని వారు చెప్పినట్టు ఆమె చెప్పింది. ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డ్ సిబ్బంది గస్తీ నిఘా విమానం ఉపయోగించి గురువారం మధ్యాహ్నం నుంచి వారి కోసం తీవ్రంగా గాలించారు. కోచికి 100 నాటికల్ మైల్స్ దూరంలో వారి పడవను గుర్తించారు. తక్షణమే కోచి నుంచి కోస్ట్‌గార్డ్ సిబ్బంది పడవతో అక్కడకు చేరుకుని వారిని సురక్షితంగా తీసుకొచ్చారు’ అని తెలిపారు.