Cockroach chutney in Andhra Pradesh government welfare hostel anakapalli
mictv telugu

బొద్దింక చట్నీ.. ఏపీలో 51 మంది పిల్లలకు అస్వస్థత

September 14, 2022

సర్కారీ హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంతో 51 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గరయ్యారు. బొద్దింక పడిన చట్నీ తినడంతో వాంతులు, కడుపునొప్పితో అల్లాడుతున్నారు. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో బుధవారం ఈ దారుణం జరిగింది. పరవాడ మండలం తానాం ప్రభుత్వం బీసీ బాలుర హాస్టల్లో ఉదయం వడ్డించిన అల్పాహారం విషపూరితంగా మారింది. ఇడ్లీతోపాటు వడ్డించిన చట్నీలో బొద్దింక కనిపించింది. 95 మంది విద్యార్థులు ఇడ్లీ, చట్నీ తినగా వారిలో 51 మంది వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. స్కూలుకు వెళ్లేక హాస్టల్ గదిలోకి వెళ్లి మెలికలు తిరుగుతూ పడిపోయారు.

విషయం తెలుసుకున్న వైద్యులు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని చికిత్స అందించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉందని, జాగ్రత్తగా చూసుకుంటున్నామని హాస్టల్ సిబ్బంది చెప్పుకొస్తున్నారు. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.