దూకుడు పెంచమంటే టీకాంగ్రెస్ నేతలకు మరోలా అర్థమైంది! - MicTv.in - Telugu News
mictv telugu

దూకుడు పెంచమంటే టీకాంగ్రెస్ నేతలకు మరోలా అర్థమైంది!

March 12, 2018

‘సింగడు అద్దంకికి పోనూ పోయాడు రానూ, వచ్చాడు’ అని సామెత. చెప్పినదాన్ని సరిగ్గా వినకుండా, అర్థం చేసుకోకుండా తనకు తోచినట్లు నడుచుకునే వాళ్లను ఇలా అంటారు. సోమవారం శాసనసభలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్‌సెడ్ విరిచేసి విసిరికొట్టడంతో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం కావడం, దీనిపై విమర్శలు రేగుతుండడం తెలిసిందే. తెలంగాణలో పార్టీ శ్రేణులు దూకుడు పెంచి, అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ అధిష్టానం జారీ చేసిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. ఇదే కాకుండా పార్టీ నేతలు రేవంత్ రెడ్డి దగ్గర్నంచి చిన్నాచితకా నేతల వరకు అందరూ పార్టీ ఆదేశాలను తమకు తోచినట్టు అర్థం చేసుకుంటూ ‘దూకుడు’ బాగా పెంచుతున్నారు. అయితే ఇది దారీతెన్నూ లేకండా సాగుతూ బూమరాంగ్‌గా మారిపోయి వారికే బొప్పికట్టిస్తోంది.ఉత్తరాది ఉత్సాహంతో..

దేశవ్యాప్తంగా కోలుకోలేని దెబ్బలు తింటున్న కాంగ్రెస్.. పూర్వవైభవం కోసం శాయశక్తులను ధారపోస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దూకుడు పెంచారు. ఇంకా కాస్త పట్టుకున్న ఉన్న రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా గుజరాత్ ఎన్నికల్లో హస్తం పార్టీ కాస్త పుంజుకుంది. అంతకు ముందు పంజాబ్ ఎన్నికల్లో, రాజస్థాన్ ఉపఎన్నికల్లో పట్టునిలబెట్టుకుంది. 2019 ఎన్నికల వరకు ఇదే జోరును కొనసాగించాలంటే.. ఆయా రాష్ర్టాల్లోని అధికార పార్టీలను తీవ్రంగా ఎండగట్టాలని అధిష్టానం బోధిస్తోంది. అయితే టీకాంగ్రెస్ నేతలకు ఇది మరోలా అర్థమైంది!

బట్టలూడదీస్తాం.. క.చ.రా., పైరవీల గవర్నర్..

ప్రతిపక్షం ప్రజాస్వామ్య వ్యవస్థ బలం. అధికార పార్టీని విమర్శించకూడదని ఎవరూ చెప్పరు. అయితే చేసే విమర్శలు, చేతలు ప్రజాస్వామికంగా ఉండాలి. వ్యక్తిగత అంశాల్లోకి వెళ్లినా అందుకు గట్టి ఆధారాలు ఉండాలి. ఏ పనిచేసినా వ్యక్తిగత రాగద్వేషాలకు సంబంధించినది కాకుండా ప్రజలకు సంబంధించినదై ఉండాలి. కానీ టీకాంగ్రెస్ ఈ విషయంలో దారి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ హవా ఇప్పటికీ బలంగానే వీస్తోంది. పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు. గత పాలకులు చేసింది శూన్యమని అంటున్నారు. ఈ దెబ్బలన్నీ కాంగ్రెస్‌కే నేరుగా తలుగుతున్నాయి. దీంతో హస్తం నేతలు.. నిర్మాణాత్మక విమర్శలకు బదులు.. అప్పటికి ఏదో ఒక అస్త్రం సంధించాలనే ధోరణిలో ముందూ వెనకా ఆలోచించకుండా దురుసుతనం ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన థర్డ్ ఫ్రంట్ గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనలు. ‘రెండు పెగ్గులేస్తే ఫ్రంటేదో బ్యాకేదో తెలియదు.. మళ్లీ థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారు.. కేసుల భయంతోనే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తెలంగాణలో భారీ భూకుంభోణాలకు పాల్పడుతున్నారు.’ అని రేవంత్ అన్నారు. అంతేకాకుండా కేటీఆర్ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లారు. కేటీఆర్ మామ పాకాల హరినాథరావు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం తెచ్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు గుడ్డలు ఊడదీస్తామని రెచ్చిపోయి మాట్లాడారు. కేసీఆర్ కాశేశ్వరరావులా కనిపిస్తున్నారన్న గవర్నర్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తే కేసీఆర్ అంటే క.చ.రా అని అన్నారు. కేటీఆర్ బావమరింది డ్రగ్స్ దందా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ ప్రయోగించిన అసభ్య, తీవ్ర పదజాలం గురించి ఇక్కడ చెప్పుకోకపోవడమే మంచిది.

ఇక వీహెచ్, ఉత్తమ్ కుమార్ వంటి నేతలు కూడా దురుసువ్యాఖ్యలు చేశారు. కేవలం టీఆర్ఎస్ నేతలనే కాకుండా ముగ్గులోకి గవర్నర్‌ను కూడా దింపారు. నరసింహన్ పైరవీలు చేసుకుంటూ పదవి కాపాడుకుంటున్నాడని, ఆతడు కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ అని, టీఆర్ఎస్‌లో చేరితే మేలని ఏకవచంలో తిట్టారు. ఈ తీవ్ర విమర్శలు టీఆర్ఎస్ నేతలు కూడాగా ఘాటుగానే బదులిస్తున్నారు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా, నువ్వు అలా చేస్తావా అనే సవాళ్లు, ప్రతిసవాళ్ల దాకా వెళ్తోంది వ్యవహారం. దీనికితోడు కాంగ్రెస్, టీఆర్ఎస్ కిందిస్థాయి కేడర్ హత్యలకు గురికావడం మరింత ఆజ్యం పోస్తోంది. విమర్శలు ప్రభుత్వ విధానాపైన కాకుండా వ్యక్తిగత అంశాల చుట్టూ తిరుగుతున్నాయి.

అయితే సర్కారుపై ఇన్ని తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు వాటికి గట్టి ఆధారాలు చూపించడం లేదు. దీంతో వారి ఆరోపణల్లో విశ్వసనీయత లేదని, ఉన్నా చాలా తక్కవని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఆరోపణలుకు అధికార పక్షం దీటుగా బదలిస్తూ, కాంగ్రెస్ హయాం నాటి తప్పులను, తెలంగాణకు జరిగిన అన్యాయాల చిట్టా విప్పుతుండడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్జించుకోలేక ‘దూకుడు’ను ‘దాడి’గా మార్చేస్తున్నారు..!