తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వల్ల వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ పరిస్థితి మరో 3 రోజుల వరకూ ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, అగ్నేయ దిశల నుంచి రాష్ట్రం మీదుగా బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో రాబోయే మూడు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది. చలి అధికంగా ఉంటుందని, చల్లగాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని , వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. నిన్న హైదరాబాద్ శివారులోని తాళ్లపల్లిలో అత్యల్ప గా 10.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రి వేళల్లో మాత్రం చలి తీవ్రత పెరుగుతున్నది. గత వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులున్నా చలి తీవ్రత తగ్గడం లేదు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గరిష్ఠం 29.8, కనిష్ఠం 17.3 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 42 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.