తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా 4, 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి తెలంగాణ వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత మరింత పెరిగింది. ఈ దెబ్బతో సంగారెడ్డి జిల్లా కోహిర్ లో సాధారణం కంటే 4.6 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 4.8 డిగ్రీలు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 5 డిగ్రీల కనిష్ట టెంపరేచర్ నమోదైంది. రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ లకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. మన వద్ద ఇలా ఉంటే ఉత్తరాదిన పరిస్థితి ఘోరంగా తయారైంది. తెల్లవారు జామున పొగమంచు కురుస్తుండడంతో రహదారులపై పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే చిన్నపిల్లలు, ముసలివారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క కాన్పూర్ ప్రాంతంలోనే 5 రోజుల్లో దాదాపు 90 మంది మరణించారు. వీరిలో అత్యధికంగా గుండెపోటుతో చనిపోవడం గమనార్హం. దీంతోపాటు పలు విమానాలు రద్దవుతుండడంతో ప్రయాణీకులు ఇక్కట్ల పాలవుతున్నారు.