కుప్పకూలిన బంగ్లా.. సత్తాచాటిన భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

కుప్పకూలిన బంగ్లా.. సత్తాచాటిన భారత్

March 22, 2022

11

మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను ఒకవైపు ఆనందింపజేస్తూ, మరోవైపు టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం బంగ్లాదేశ్, భారత్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ దెబ్బకు బంగ్లాదేశ్ జట్టు కుప్పకూలింది. లీగ్ దశలో కీలక మ్యాచ్ కావడంతో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ రాణించి బంగ్లాదేశ్‌పై 110 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.

మొదటగా టాస్ గెలిచిన భారత్.. ముందు బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్‌లో భాగంగా యస్టిక భాటియా 50 పరుగులు సాధించగా.. ఓపెనర్లు స్మృతి మందన 30, షఫాలి వర్మ 42 పరుగులు రాబట్టారు. వీరికి పూజ వస్త్రాకర్, స్నేహ్ రాణా మద్దతుగా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 229 పరుగులు సాధించింది. అంతేకాకుండా రితుమోని మూడు వికెట్లు తీసింది. నహీదా అక్తర్ 2 వికెట్లు తీసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా యస్టిక భాటియా ఎంపికైంది.

అనంతరం 230 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు కట్టి పడేశారు. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ వెన్ను విరిచేలా స్నేహ్ రాణా బౌలింగ్ తో విరుచుకుపడింది. పూజ వస్త్రాకర్, జులాన్ గోస్వామి సైతం 2 చొప్పున వికెట్లు పడగొట్టారు. భారత బౌలింగ్ దాడికి బంగ్లాదేశ్ జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా వెనుదిరిగారు. సల్మాన్ ఖాటున్ 32 పరుగులు ఒక్కటే జట్టులో అత్యధిక స్కోరు చేయడం పరిస్థితిని తెలియజేస్తోంది. 40.3 ఓవర్లకే 119 పరుగులకు ఆల్ అవుట్ అయింది.