బీజేపీ నేత చెంప పగులగొట్టిన కలెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ నేత చెంప పగులగొట్టిన కలెక్టర్

January 19, 2020

Nidhi Nivedita.

మధ్యప్రదేశ్‌లో తిరంగా యాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనుమతి లేకుండా చేస్తున్న తిరంగా యాత్రను జిల్లా మహిళా కలెక్టర్ అడ్డుకున్నారు. దీంతో ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఆమెతో ఘర్ణణకు దిగడంతో.. అతని కాలర్ పట్టుకుని చెంప పగులగొట్టారామె. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో అనుమతి లేకుండా బీజేపీ నాయకులు తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ ర్యాలీకి అధికారులు అనుమతి ఇవ్వలేదు. అక్కడికి వచ్చిన రాజ్‌గఢ్ కలెక్టర్ నివేదిత అనుమతి తీసుకోకుండా ర్యాలీ ఎలా నిర్వహిస్తారని వారిని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే అమర్ సింగ్ యాదవ్ కలెక్టర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు.  

మహిళా కలెక్టర్ అన్న మర్యాద కూడా లేకుండా దురుసుగా ప్రవర్తించారు. దీంతో కలెక్టర్ ఆయన చెంప పగలగొట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే బీజేపీ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే కొంతమంది కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ ర్యాలీకి ముందే అనుమతి లేదని అంటున్నారు అధికారులు. కలెక్టర్ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరంగ యాత్రకు అనుమతి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని కలెక్టర్ నివేదిత అంటున్నారు. తాను ఎవరిపై దాడికి పాల్పడలేదని స్పష్టం చేశారు. తమ అధికారుల జుట్టు పట్టుకుని లాగారని, దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. వీళ్ల దృష్టిలో చట్టానికి విలువే లేదని అన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.