మందుబాబుకు మండితే మామూలుగా వుండదు… మ్యాటర్ మరోలా వుంటుంది అనుకున్నట్టున్నాడు ఇతడు. విజయ్ మాల్యా బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసాక కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలు జరగడం లేదు. దీంతో తన ఫేవరేట్ బ్రాండ్ బీర్ కనిపించడంలేదని ఓ తాగుబోతు హైరానా చెందాడు. దీన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని బీరు మీద శపథం చేశాడు. వెంటనే తన బాధనంతా వెళ్ళగక్కుతూ ప్రజావాణిలో కలెక్టర్కు లెటర్ రాశాడు. ఈ విధంగా వుంది అతని లెటర్ సారాంశం…ప్రజావాణికి ఫిర్యాదు…
శ్రీయుత గౌరవ నీయులైన కలెక్టర్ గారు
జగిత్యాల జిల్లా గారికి
ఆర్యా !
విషయము : జగిత్యాల పట్టణం మరియు మరికొన్ని మండలాల్లో కింగ్ ఫిషర్ బీర్ విక్రయాలను జరపకపోవడంపై తమరికి ఫిర్యాదు..
తమరికి మనవి చేయునది ఏమనగా.. జగిత్యాల పట్టణంలో వైన్ షాప్స్ మరియు బార్ అండ్ రెస్టారెంట్లలో గత కొన్నేండ్లుగా కింగ్ ఫిషర్ బీర్లను అమ్మడం నిలిపివేశారు. ప్రజల్లో, మద్యం ప్రియుల్లో, యువత ఎక్కువగా ఇష్టపడి సేవించే బీర్లలో కింగ్ ఫిషర్ మొదటి స్థానంలో వుంటుంది. ఈ బీర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. కానీ జగిత్యాలలోని మద్యం విక్రయదారులు సిండికేటుగా మారి కింగ్ ఫిషర్ బీరును విక్రయించడం బందు చేశారు. ఈ బీర్ల స్థానంలో మరొక నాసిరకం బీరును విక్రయిస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని మనవి చేస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులలోని స్వేచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారని తమరికి మనవి చేస్తున్నాను. జగిత్యాల పట్టణం మరియు పలు మండలాల్లో ఏ నెల నుంచి కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించడం నిలిపివేశారన్న అంశంపై విచారణ జరిపించాలని, మద్యం డిపోల్లో స్థానికి మద్యం వ్యాపారులు, కింగ్ ఫిషర్ కోటాను కొనుగోలు చేయకపోవడంపై విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకుని.. కింగ్ ఫిషర్ బీర్లను మద్యం ప్రియులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నాను
ఇట్లు మీ విధేయుడు
అయిల సూర్యనారాయణ(TV సూర్యం)
జగిత్యాల