రోడ్డుపై యువకుల కొట్లాట.. కారు గుద్ది గాల్లో ఎగిరినా ఆపలేదు.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డుపై యువకుల కొట్లాట.. కారు గుద్ది గాల్లో ఎగిరినా ఆపలేదు.. వీడియో

September 22, 2022

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రెండు గ్రూపులకు చెందిన యువకులు కొట్టుకుంటున్నారు. అదే సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఆ ధాటికి ఓ యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డా.. గొడవ మాత్రం ఆపలేదు. అసలేం జరగలేదన్నట్టు మళ్లీ గొడవల్లో పడ్డారు. ఈ వీడియోను మరో ప్రయాణికుడు తన కారు నుంచి వీడియో తీయగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియో ప్రకారం.. కొందరు కాలేజీ స్టూడెంట్స్ రోడ్డుపై మూకుమ్మడిగా గొడవ పడుతున్నారు. అప్పుడే ఓ కారు వేగంగా వచ్చి ఢీకొనగా, ఓ యువకుడు అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డాడు.

 

పోనీ పడి లేచాక దెబ్బలు ఏమైనా తగిలాయా? లేక కారు యజమానిని పట్టుకొని ప్రశ్నించాడా? అంటే లేదు. ఎగిరి కింద పడ్డ యువకుడు మళ్లీ లేచి తిరిగి గొడవ పెట్టుకున్నాడు. గొడవ ఇంకా ఎక్కువవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పలువురు విద్యార్ధులను అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారయ్యారు. అయితే విద్యార్ధులు పట్టించుకోకపోయినా పోలీసులు వీడియో చూసి కారును స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని, విద్యార్ధులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.