కర్ణాటకలోని మంగుళూరులో ఈ ఘటన జరిగింది. ప్రముఖ కాలేజీలో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులు ఓ ప్రైవేటు అపార్టుమెంటులో ముద్దుల పోటీలు నిర్వహించారు. ఆరు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో వాట్సాప్ ద్వారా బయటపడడంతో సంచలనం రేగింది. వీడియో ప్రకారం.. యూనిఫామ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్ధులు కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయారు. దీంతో పరువు పోయిందని భావించిన తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం వీడియోపై ఫిర్యాదు చేయకుండానే పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాట్సాప్ ద్వారా వీడియో వైరల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారో విచారిస్తున్నారు. ముద్దుల పోటీలు జరిగే సమయంలో డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషనర్ శశికుమార్ వెల్లడించారు. కాగా, కిస్సింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్ధినీ విద్యార్ధులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్టు కాలేజీ యాజమాన్యం తెలిపింది.