జడ్జీల నియామకాలు చేపట్టే కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు దిశానిర్దేశం చేసేది రాజ్యాంగమేనని, ఆ మూడింటి బాధ్యతలకు సంబంధించి ‘లక్ష్మణ రేఖ’ స్పష్టంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పరిపాలనా నియామకాల విషయంలో కూడా న్యాయమూర్తులు భాగమైతే, న్యాయవ్యవస్థ పని ఎవరు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషనర్ల నియామకాల అంశాన్ని రాజ్యాంగం నిర్దేశించిందని, అందుకు అనుగుణంగా నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. ఏ వ్యవస్థ పరిపూర్ణమైనది కాదని చెప్పిన సీజేఐ .. జడ్జీల నియామక ప్రక్రియలో మనం రూపొందించుకున్న కొలీజియం ఉత్తమమైన వ్యవస్థ అని చెప్పారు. “ఈ విషయంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుతో వాదనలు చేయాలని అనుకోవడం లేదు. ఇద్దరికి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. భిన్నమైన అభిప్రాయాలు ఉంటే తప్పేంటి? న్యాయవ్యవస్థలోనూ అభిప్రాయభేదాలు ఉంటాయి” అని వ్యాఖ్యానించారు.
తీర్పుల్లో ఇతరుల జోక్యం గురించి మాట్లాడుతూ.. కేసుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పారు. న్యాయమూర్తిగా తన 23 ఏళ్ల కెరీర్‌లో ఏదైనా కేసు విషయం ఇలాంటి తీర్పు ఇవ్వమని ఎవరూ తనకు చెప్పలేదని సీజేఐ వెల్లడించారు. వ్యవస్థను ఉన్నది ఉన్నట్లుగా ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన న్యాయమూర్తిగా తన బాధ్యతని పేర్కొన్నారు. జడ్జీల నియామకాలకు సరైన నియమ నిబంధనలను పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వస్తున్న ట్రోలింగ్స్‌పై సీజేఐ స్పందిస్తూ.. అలాంటి వ్యంగ్యాస్త్రాలు తమను ప్రభావితం చేయలేవన్నారు. మాజీ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ కొలీజియం వ్యవస్థ ఆదర్శప్రాయమైనదని పేర్కొనగా.. మరో మాజీ సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే దానిని సమర్థిస్తూనే ప్రభుత్వ అభిప్రాయం కూడా కీలకమేనన్నారు.