కొలంబియన్ డ్రగ్ లార్డ్ , నార్కో టెర్రరిస్ట్, కొకైన్ రాజుగా పిలువబడే ఎస్కోబార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతని పెంపుడు జంతువులైన హిప్పోలు కంపు కంపు చేస్తుండటంతో వాటిని వదిలించుకునేందకు కొలంబియన్ గవర్నమెంట్ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. చివరికి వీటిని భరించడం తమవల్ల కాదని నిర్ణయించుకుని తాజాగా వాటిని భారత్కు, మెక్సికోకు తరలించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
చరిత్రలో అత్యంత సంపన్న నేరస్థుడైన ఎస్కోబార్ చనిపోయి 30 ఏళ్లు అవుతోంది. ఈ డ్రగ్ ట్రాఫికర్ 1980 ఆఫ్రికా నుంచి అక్రమంగా 4 హిప్పోలను దిగుమతి చేసుకుని వాటిని మాగ్డలీనాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదీ ప్రాంతంలో పెంచుకున్నాడు. 1993లో ఎస్కోబార్ మరణం తరువాత అతడు పెంచుకునే అన్యదేశ జంతువులను సేకరించి వివిధ ప్రాంతాలకు మార్చారు కొలంబియన్ అధికారులు. కానీ, హిప్పోలను మాత్రం రవాణా చేయలేకపోయారు. వాటిని నదీ ప్రాంతంలోనే వదిలేశారు. అయితే ఒకప్పుడు నాలుగుగా ఉన్న వాటి సంఖ్య ఇప్పుడు 130 నుంచి 170కి చేరుకుంది. దీంతో ఆ ప్రాంతమంతా కంపు కంపుగా మారిపోయింది. అంతే కాదు ఈ హిప్పోలు అక్కడి నేల సారాన్ని పాడుచేయడం, నీటిని కలుషతం చేశాయి. స్థానికులు వాటితో ప్రాణాపాయం ఉందని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వాటి సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించలేదు.
ఈ హిప్పోలను భరించడం కష్టతరమవడం స్థానికుల ఒత్తిడి పెరగడంతో చివరి ప్రయత్నంగా దూర ప్రాంతాలకు వీటిని తరలించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 60 నీటి ఏనుగులను భారత్ కు, మరో 10 హిప్పోలను మెక్సికోకు పంపించాలనుకుంటోంది కొలంబియా. ఈ ప్రతిపాదనపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.