రండి, ఎంబసీ ఓపెన్ చేయండి.. భారత్‌కు తాలిబన్లు విజ్ఞప్తి - MicTv.in - Telugu News
mictv telugu

రండి, ఎంబసీ ఓపెన్ చేయండి.. భారత్‌కు తాలిబన్లు విజ్ఞప్తి

March 18, 2022

gnhfthb

ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని ప్రపంచ దేశాలు ఒంటరిని చేసిన భారతదేశం మాత్రం ఆఫ్ఘనిస్థాన్‌కు తనవంతు సహాయసహకారాలు అందిస్తూనే ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తిండి లేక అలమటించిపోతున్న ప్రజలకు సాయం చేయాలన్న ఉద్దేశంతో 50 వేల టన్నుల గోధుమలను పంపిస్తోంది. ఇప్పటికే 8వేల టన్నులను 4 షిప్‌మెంట్లలో పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయంగా తమ ప్రభుత్వానికి గుర్తింపు దక్కించుకోవడంలో భాగంగా భారత్ వైపు తాలిబన్లు ఎదురు చూస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా భారత్‌ను తాలిబన్ల పాలకులు కోరారు. ఐక్యరాజ్య సమితికి తాలిబన్ల రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుహైల్ షాహీన్.. ఎంబసీ పెట్టాలంటూ భారత్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు కాబూల్‌లో తగిన భద్రతను తాము కల్పిస్తామని, అది తమ పూచీ అని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తాలిబన్లు మాట్లాడుతూ.. ‘భారత్‌తో పాటు ఇదివరకు కాబూల్‌లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసి, ఇటీవల మూసేసిన దేశాలన్నీ తిరిగి ఎంబసీలను ఓపెన్ చేయాలన్నదే మా విజ్ఞప్తి. ఇంతకుముందు కార్యకలాపాలను ఎలా నిర్వహించారో ఇప్పుడూ అలాగే సాధారణంగా నిర్వహించుకునేలా మేం తగిన సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తాం” అని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలంటే తమకు రాయబార కార్యాలయాలు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

కాగా, ఆఫ్ఘనిస్థాన్‌కు రోడ్డు మార్గంలో గోధుమలను పంపించేందుకు అటారీ–వాఘా సరిహద్దును భారత్ వినియోగించుకుంటోంది. అందుకు పాకిస్థాన్ కూడా ఒప్పుకొంది. 2007 తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని పాక్ వాడుకోనివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.