ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ తాను వ్యాఖ్యాతగా వ్యవహరించే టీవీ ప్రోగ్రాం ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి తానే అతిథిగా వచ్చాడు. ఈ కార్యక్రమానికి కొంతకాలం విరామం ప్రకటిస్తున్న నేపథ్యంలో సుమ యాంకర్ గా వ్యవహరించగా, అలీ తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాతల నుంచి మొదలు పెట్టి చిన్నప్పుడు సినిమాల్లో ఎంట్రీ, మద్రాసులో పడిన కష్టాలు, తర్వాత తన సక్సెస్ కి కారకులు, హీరోగా ఎంట్రీ, కుటుంబ సమస్యలు, ఇటీవల జరిగిన కూతురి పెళ్లి, వియ్యంకుల గురించి ఇలా మొత్తం వివరాలను మాటల రూపంలో వెల్లడించారు. వీటితో పాటు ఆయనకు మాత్రమే సాధ్యమైన చాట భాష, లాంతర్ ఫగిడి, జంబల్ హాట్ రాజా వంటి పదాలకు అర్ధం తెలిపాడు. అత్యంత ఆసక్తికర అంశమేమిటంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తనకున్న విభేదాలపై స్పందించడం. అలీ వైసీపీకి వెళ్లడంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, అందుకే అలీ కూతురి పెళ్లికి రాలేదని వార్తలు వచ్చాయి. వాటి గురించి అడగ్గా అలీ కొట్టి పారేశారు. దాని గురించి చెప్తూ ‘ఆహ్వాన పత్రిక పట్టుకొని పవన్ షూటింగ్ లొకేషన్ కి వెళ్లాను. నేనొచ్చానని తెలిసి ఆయనే స్వయంగా నా దగ్గరికి వచ్చారు. ఇద్దరం 15 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆ గ్యాపులో వేరేవారు వస్తే బిజిగా ఉన్నానని చెప్పమన్నారు. తర్వాత పెళ్లికి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. అయితే పెళ్లి సమయంలో చివరి నిమిషంలో విమానం మిస్సైనందుకు రాలేకపోయారు. అంతేకానీ, బయట జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. కొన్ని వెబ్ సైట్లు కావాలనే వారి ప్రయోజనాల కోసం మా మధ్య ఏదో ఉన్నట్టు రాశారు. మేమిద్దరం 15 నిమిషాలు ఏం మాట్లాడుకున్నామో వారికి తెలియదు కదా. ఏదో రాస్తే అందరూ ఆసక్తిగా చూస్తారని అనుకుంటారు. కానీ ఏమీ ఉండదక్కడ. అంతేకానీ, మా మధ్య గ్యాప్ ఏమీ లేదు’ అని స్పష్టం చేశారు.