పార్టీ మార్పుపై స్పందించిన కమెడియన్ అలీ
టాలీవుడ్ కమెడియన్ అలీ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ లేదా జనసేనలో చేరతారనే ఊహాగానాలు ఇటీవల వినిపించాయి. కొందరు జనసేనలో చేరి రాజమండ్రి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని రూమర్ ప్రచారం చేశారు. రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి జగన్ మాట తప్పడంతో అలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా స్పందించిన అలీ వాటిని కొట్టిపాడేశారు. వైసీపీలో చేరింది పదవి కోసం కాదని, జగన్‌ను సీఎం చేయడానికేనని స్పష్టం చేశారు. పదవి కోసం ఏనాడూ ఆశపడలేదని వెల్లడించాడు.
వైసీపీలో చేరినప్పుడు జగన్ ఫలానా పదవి ఇస్తానని చెప్పలేదని, కానీ ఏదో ఒక పదవి ఇస్తానని గట్టిగా చెప్పారని వివరించారు. వక్ఫ్ బోర్డు చైర్మెన్ పదవి ఇతరులకు కేటాయించారని, అది తనకు రావట్లేదన్నారు. జగన్ మనసులో తానున్నానని, ప్రభుత్వం నుంచి ఏదో ఒకరోజు పిలుపు వస్తుందని మాత్రం ఖచ్చితంగా తెలుసన్నారు. ఆరోజు మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు అలీ అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేసి గెలుపులో తనవంతు పాత్ర పోషించారు. అయితే ఇంతవరకు ఏ పదవీ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి. వాటిని అలీ ఖండించడంతో అవన్నీ రూమర్లని తేలిపోయాయి.