యూటర్న్ తీసుకున్న పృథ్వీ.. జనసేన భవిష్యత్తుపై కామెంట్లు - MicTv.in - Telugu News
mictv telugu

యూటర్న్ తీసుకున్న పృథ్వీ.. జనసేన భవిష్యత్తుపై కామెంట్లు

June 14, 2022

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ విభిన్న మేనరిజంతో పాపులర్ అయిన కమెడియన్ పృథ్వీ తాజాగా యూటర్న్ తీసుకున్నారు. ఇంతకు ముందు వైసీపీకి మద్ధతుదారుడిగా ఉంటూ, తర్వాత స్వీయ తప్పిదాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. తర్వాత నటుడిగా కొనసాగుతానంటూ ప్రకటించి, తన కూతురిని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కష్టకాలంలో తనకు అవకాశాలిచ్చి ఆదుకున్న మెగా కుటుంబానికి రుణపడి ఉంటానని మీడియా సాక్షిగా వెల్లడించారు. ఇప్పుడు తాజాగా రాజకీయ స్టేట్‌మెంట్ ఒకటి ఇచ్చారు. ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ జోస్యం చెప్పారు. ‘పవన్ రెండు చోట్లా ఓడిపోయాడు. ఇంకేం గెలుస్తాడు అంటున్నారు. చూస్తూండండి. పది సీట్లు కాదు. నలభై సీట్లు వచ్చే ఎన్నికల్లో కొట్టబోతున్నాం. పవన్ కల్యాణ్ కింగ్‌గా నిలవబోతున్నారు. జనాల కోసం పోరాడే నాయకుడు కావాలని ప్రజలు అనుకుంటున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో పృథ్వీ వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారని స్పష్టమవుతోంది. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తారా? లేదా అనేది తెలియరాలేదు. ఏది ఏమైనా వైసీపీకి గట్టి మద్దతుదారుగా నిలిచిన పృథ్వీ సడెన్‌గా రూట్ మార్చడంతో పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు.