‘చేతికి మైక్ దొరికితే ఇష్టమొచ్చినట్టు వాగుతారా’ అంటూ టాలీవుడ్ కమెడియన్ షకలక శంకర్ తాజాగా ధ్వజమెత్తాడు.తెలుగు ప్రజలు ప్రేమతో ఆరాధిస్తున్న సూపర్ స్టార్స్ అంత తేలిగ్గా తీసిపడేయటం అవసరమా.. అంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పై ఫైర్ అయ్యారు. రాజయోగం సినిమా కోసం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో షకలక శంకర్, తాగుబోతు రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షకలక శంకర్ పేరు చెప్పకుండా బండ్ల గణేష్‌పై తమదైన శైలిలో కౌంటర్ ఇవ్వగా.. తాగుబోతు రమేష్ సైతం మద్దతుగా నిలిచాడు. దీనికంతటకీ కారణం మొన్న ధమాకా సక్సెస్ ఈవెంట్ లో బండ్ల చేసిన కామెంట్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పూనకాలు వచ్చినట్టు భజన చేసే బండ్ల గణేష్ మొన్న రవితేజపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. అండదండ లేకుండా సొంతంగా పైకొచ్చిన రవితేజ అన్ని పొగడ్తలకి అర్హుడే కానీ. రవితేజని పొగడటం కోసం ఇతర స్టార్ హీరోలని కించపరచినట్టు వ్యాఖ్యానించాడు బండ్ల గణేష్. ఇక్కడే మరోసారి కాంట్రవర్సీ అయిపోయాడు బండ్ల గణేష్. ఈ తప్పుడు వ్యాఖ్యలని కమెడియన్ షకలక శంకర్ ఖండించాడు.
‘కొంత మంది మైక్ తీసుకుని మాట్లాడుతారయ్యా! వాళ్లకి శతకోటి దండాలు. ఏం మాట్లాడుతారో అర్థం కాదు. నిన్న మొన్న ఓ ప్రొడ్యూసర్ ఏదో అంటున్నాడు. రెండు, మూడు సంవత్సరాలు ఏదో ట్రై చేస్తే అదృష్టవశాత్తు సూపర్ సార్ట్స్, మెగాస్టార్స్ అయిపోతారంట ఆయన దృష్టిలో. మెగాస్టార్స్, సూపర్ స్టార్స్ అదృష్టంతో కారండి. ఎన్నో రాత్రిళ్లు సరైన తిండి, తిప్పలు లేక కష్టాలు పడితే వాళ్లు స్టార్స్ అయ్యారు. మరి ఆయన ఎందుకన్నాడో.. ఏ ఉద్దేశంతో అన్నాడో ఆయనకే తెలియదు. నీ ఎదురుగా ఎవరో హీరో ఉన్నారు కదా అని నువ్వు ఉబ్బి పోయి, తబ్బిపోయి, మై మరచిపోయి, నీ బుర్రలో ఏముందో కూడా మరచిపోయి, బుద్ధిలేకుండా ఇండస్ట్రీ చరిత్ర నిలబెట్టిన మహానుభావుల గురించి నువ్వంత చులకనగా, తక్కువగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఎవరికీ కనెక్ట్ కావాలో వారికి కనెక్ట్ అవుద్ది. పేరెందుకులే’’ అని స్టేజ్‌పై బండ్ల గణేష్ కి కౌంటర్ ఇచ్చాడు షకలక శంకర్. మరి ఈ కామెంట్స్ కి బండ్ల ఎలాంటి కౌంటర్ ఇస్తాడో వేచిచూడాలి.