టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ మీద నటి శ్రీరెడ్డి చేసిన ఉద్యమంలో ఆరోపణలు వచ్చాయి, కానీ ఇంకా ఎవరి మీద ఎలాంటి చర్యలకు పూనుకోలేరు. కానీ హాలీవుడ్లో మాత్రం తొలిసారి ఒకరికి శిక్ష పడింది. సినిమా రంగంలో ఏం చేసినా చెల్లుతుంది.. అవకాశాల కోసం అమ్మాయిలను వాడుకోవడమే పనిగా పెట్టుకున్నవారి కాళ్ళ కింద లుకలుకలు మొదలయ్యాయని అక్కడి నటీమణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు ఇలాంటి చర్యలు భరోసాను ఇస్తాయని అంటున్నారు. హాలీవుడ్ నుంచి మొదలైన మీటు ఉద్యమంలో తొలిసారి హాలీవుడ్ హాస్యనటుడు బిల్ కోస్బీకి ఏకంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడింది.‘అమెరికా డాడీ’ అని అతనికి ఉత్తమ హాస్యనటుడిగా మంచి పేరుంది. 1980 దశకంలో అతనో పెద్ద స్టార్. ఓ యువతిని అత్యాచారం చేసిన కేసులో ఆయనకు పెన్సిల్వేనియా కోర్టు మూడు నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం కోస్బీ వయసు 81 ఏళ్లు. 2004లో ఆండ్రియా కాన్స్టాండ్ అనే మహిళకు మాదక ద్రవ్యాలు ఇచ్చి, ఆమెను శారీరకంగా వేధించినట్లు కోస్బీపై ఆరోపణలు వచ్చాయి. విచారణలో దోషిగా తేలిన కమెడియన్ కోస్బీ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఆండ్రియా సినిమాల్లో వెలిగిపోదామని వచ్చినందుకు ఆమె ఆశలను కోస్బీ అడియాశలు చేశాడని మాంట్గోమేరీ కౌంటీ జడ్జి తన తీర్పులో వెల్లడించారు.
అయితే కోస్బీ బెయిల్ కోసం పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.