త్వరలో జనాభా నియంత్రణ చట్టం - కేంద్ర మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో జనాభా నియంత్రణ చట్టం – కేంద్ర మంత్రి

June 1, 2022

దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభాను అరికట్టేందుకు జనాభా నియంత్రణ చట్టాన్ని త్వరలో తీసుకొస్తామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు. చత్తీస్‌గఢ్‌లో జరిగిన గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో జనాభా నియంత్రణ చట్టం త్వరలో తీసుకొస్తాం. అందులో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. లేకుంటే అధిక జనాభాతో దేశంలో సంక్షోభం ఏర్పడుతుంది. ఆచరణ సాధ్యం కాని హామీలంటూ విమర్శించిన బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా దేశ సంక్షేమం కోసం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నా’మని వివరించారు. కాగా, పార్లమెంటులో ఇప్పటికే రెండుసార్లు జనాభా నియంత్రణ పేరుతో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ, వాటిపై ఎటూ తేల్చలేదు. తాజా మంత్రి వ్యాఖ్యలతో ఆ అంశం మరోమారు చర్చకు వచ్చింది. కాగా, కామన్ సివిల్ కోడ్ బిల్లును త్వరలో తీసుకురాబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ సిద్ధమైనట్టు, ఏ క్షణమైనా పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని వెల్లడించాయి.