కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”నాకు ఫలానా అమ్మాయి అంటే ఇష్టం. కానీ, తనను పెళ్లి చేసుకోలేను. తను నాకు గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే, ఎప్పటికీ నాకు భార్య కాలేదు అన్నట్లు’గా కేకేఆర్ యాజమాన్యం ‘రింకూ సింగ్’ విషయంలో తన వైఖరి మార్చుకోవటం లేదని మండిపడ్డాడు.
సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో కేకేఆర్ తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కేకేఆర్ ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ నెగ్గిన కోల్‌కతా.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్.. ఆరంభంలోనే ఇంద్రజిత్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(34)తో కలిసి నితీశ్ రాణా(48 నాటౌట్)గా కేకేఆర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బౌల్ట్ బౌలింగ్‌లో అయ్యర్ ఔట్ అయ్యాడు. దాంతో కేకేఆర్ అభిమానులు నిరాశ చెందారు. ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చిన.. ‘రింకూ సింగ్’ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేసి, కేకేఆర్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా రింకూ సింగ్‌పై ప్రశంసలు కురిపిస్తూ, కేకేఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ”రింకూ సింగ్ అద్భుతంగా రాణించాడు. అతడికి పెద్దగా అవకాశాలు రావు. అయితే, వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటాడు. అదేంటో గానీ, పాపం అతడు మంచి స్కోర్లు నమోదు చేసినా ఎనిమిది లేదంటే తొమ్మిదో స్థానంలో ఆడిస్తారు. కేకేఆర్ వ్యవహారశైలి ఎలా ఉంటుందంటే.. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. కానీ తనను పెళ్లి చేసుకోలేను. తను నాకు గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఎప్పటికీ భార్య కాలేదు అన్నట్లు రింకూను వేలంలో కొంటారు. జట్టులో పెట్టుకుంటారు. కానీ అవకాశాలు ఇవ్వరు” అని అన్నారు.