Common devotees were troubled due to minister Roja's visit to Lepakshi temple
mictv telugu

రోజా అధికార గలీజ్.. సంప్రదాయానికి విరుద్ధంగా..

November 23, 2022

దైవ దర్శనం కోసం ఏ గుడికైనా భక్తులు రావడం సహజం. వారిలో సామాన్యులూ ఉంటారు. ఈ విషయం గ్రహించలేకపోయారో ఏమో తెలియదు గానీ.. ఏపీ మంత్రి రోజా అధికార దర్పం ప్రదర్శించారు. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ఆమె.. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లాలోని లేపాక్షి దుర్గా, వీరభద్రస్వామి ఆలయ సందర్శనానికి వెళ్లారు. అయితే అక్కడి అర్చకులు ఆమె అన్ని రకాల మర్యాదలూ చేశారు. కానీ ఆలయంలోకి ఆవిడతోపాటు సామాన్య జనం కూడా రావడంతో మంత్రి గారికి కోపం వచ్చింది. తాను వచ్చింది గుడి చూడటానికా.. జనాన్ని చూడటానికా అని పోలీసులపై చిర్రుబుర్రులాడారు.

ఆమె సీరియస్ అయ్యారని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రధాన ద్వారాన్ని పది నిముషాల పాటు మూసేశారు. సంప్రదాయం మేరకు ప్రధాన ద్వారాన్ని ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తెరిచి ఉంచాలి. గ్రహణ సమయాల్లో తప్ప.. మధ్యలో ఆలయ ద్వారాన్ని మూయరాదు. అలాంటిది మంత్రి సేవలో ఆలయ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ప్రధాన ద్వారాన్ని మూసేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వచ్చారని ఇలా చేయడం సబబు కాదంటూ పోలీసులు, దేవదాయ శాఖపై మండిపడ్డారు. ఆలయ ద్వారం మూసేయడంతో లోపల మంత్రి ఫొటోలకు ఫోజులిచ్చుకుంటూ గడిపారు. అంతేకాదు, వైసీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా అనుమతించలేదు. అధికారుల తీరుపై వారు కూడా మండిపడ్డారు. గంటల తరబడి బయట వేచి ఉన్న భక్తులు.. మంత్రితీరుపై అసహనం వ్యక్తం చేశారు.