ప్రస్తుత కాలంలో నీతి,నిజాయితీ ఉన్న వ్యక్తుల కంటే.. ఎక్కువగా డబ్బున్న వారికి, అవినీతిపరులకు, నేర చరితులకు, రకరకాల స్కాంల్లో చిక్కుకున్న వారికే రాజకీయ పార్టీలు పట్టం కడుతున్నాయి. కండబలం ఉన్న రౌడీలకు, గుండాలకు, హింస, హత్యలు, కుట్రలు, దోపిడీలు, కుంభకోణాల్లో సంబంధాలు ఉన్న అభ్యర్థులకు, మాఫియా గ్యాంగులకు, స్మగ్లర్స్, దేశ ద్రోహులకు టికెట్లు కట్టబెడుతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. అలా రాజకీయ నాయకులైన వాళ్లపై ఇప్పటికీ కూడా వారిపై దాఖలైన క్రిమినల్ కేసుల్లో దశాబ్దాలుగా విచారణ సాగుతుంది. ఆ కేసులు వాయిదా పడడం.. తీర్పులు రాకపోవడం తప్ప మరే పురోగతి లేదు. ఇలా క్రిమినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని అసలు ఎన్నికల్లో పోటీచేయకుండా ముందే నిషేధించాలంటూ తాజాగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ సందర్భంగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
అవినీతికి సామాన్య మానవుడు బలవుతున్నాడని, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతిని రూపుమాపాలంటే అన్నిస్థాయుల్లో జవాబుదారీతనాన్ని తేవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ తన వాదనలు వినిపిస్తూ.. ‘‘వేధింపులు, హత్య, అపహరణ లాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి.. ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్ లేదా పోలీస్ కానిస్టేబుల్ కూడా కాలేడు. కానీ అవే నేరాలు చేసిన వ్యక్తి మాత్రం మంత్రి కావొచ్చు’’ అని పేర్కొన్నారు. ఈ పిల్‌పై స్పందన తెలపాల్సిందిగా కేంద్రం, ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.