ఖమ్మంలో పోలీసుల దందా.. తిరగబడ్డ భారతీయుడు (వీడియో)
కొత్త మోటార్ వాహన చట్టం 2019 అమలులోకి వచ్చాక దేశవ్యాప్తంగా పోలీసులు అయినాదానికీ కాని దానికీ ఎడాపెడా ఛలానాయిస్తున్నారు. చివరికి ఈ చట్టం పరిధిలోకి రాని ఎద్దుల బండికీ చలా వేశారు. ఆటో డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని వింతవింత వడ్డింపులు పెడుతున్నారు. దీంతో వాహనదారులకు రోడ్డుపై ప్రయాణించాలంటే చుక్కలు కనిపించే పరిస్థితి ఏర్పడింది. కొత్త చట్టాన్ని అదనుగా భావించిన కొందరు పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రోడ్డుపైకొచ్చి ‘ఏయ్ హెల్మెట్ వుందా? పేపర్స్ అన్నీ వున్నాయా? చలో ఫైన్ కట్టు’ అని గద్ధిస్తున్నారు. అలాంటి పనే చేశారు ఖమ్మంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు.
ఖమ్మం ట్యాంక్ బండ్ సమీపంలో వారు ఇద్దరు పోలీసులు వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. నిబంధనల ప్రకారం తమ వెంట ఎస్సై, సీఐ లేకపోయినా తనిఖీ అంటూ దందా సాగించారు. వాహనదారులను ఆపి కాగితాలు అడిగారు. కొందరు కాగితాలు లేనివాళ్లు అమాయకంగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఇంకొందరు డబ్బులు చేతిలో పెట్టి జారుకున్నారు. కానీ, ఓ సామాన్యుడు మాత్రం పోలీసులు అనే భయాన్ని వదిలిపెట్టి ప్రశ్నించాడు.
చేతిలో ఫోన్ పట్టుకుని కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తూ పోలీసులపై తన ఇంటరాగేషన్ ప్రారంభించాడు. కనీసం ఎస్సై లేకుండా ఎలా కాగితాలు అడుగుతారని, నీ పేరేంటని, మీకున్న అర్హతలు ఏంటని? చాలా గట్టిగా నిలదీసాడు. దీంతో లంచకభటులు కెెమెరాకి ముఖం చాటేస్తూ అటుగా వెళ్తున్నారు. అయినా ఆ సామాన్యుడు వాళ్లను వదిలిపెట్టకుండా గట్టిగా ప్రశ్నించాడు. వాళ్లకు ఏం చెప్పాలో అర్థంకాక బిత్తర చూపులు చూస్తూ పోలీస్ స్టేషన్‌కు రండి అంటూ అక్కడినుంచి జారుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.