3 రోజుల్లోగా నన్ను మంత్రిని చేయండి.. సీఎంకు సామాన్యుడి షాక్  - MicTv.in - Telugu News
mictv telugu

3 రోజుల్లోగా నన్ను మంత్రిని చేయండి.. సీఎంకు సామాన్యుడి షాక్ 

July 8, 2020

MP

చట్ట సభల్లో ఎలాంటి సభ్యత్వం లేకున్నా కూడా మంత్రి, సీఎం, ప్రధాని సులువుగా అయిపోవచ్చు. ఆ అవకాశం మనకు భారత రాజ్యాంగం కల్పించింది. అయితే ఆరు నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాల్సి ఉంది. కానీ ఇది రానురానూ అపహాస్యం అవుతోంది. తమ రాజకీయ సమీకరణాల కోసం అప్పనంగా పదవులు కట్టబెట్టే పరిస్థితికి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఇదే జరిగింది. ఏ సభలోనూ సభ్యులుగా లేని 14 మంది మంత్రులుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. దీంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు దిమ్మతిరిగేలా ఓ సామాన్యుడు లేఖ రాశాడు. 

బాల్ చంద్‌వర్మ అనే వ్యక్తి లేఖరాస్తూ..వెంటనే తనను కూడా మంత్రిగా చేయాలని కోరాడు. తన లేఖ అందిన మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని గడువు కూడా విధించాడు. ఇటీవల 14 మంది మంత్రులు ఏ సభలోనూ సభ్యులు కాకపోయినా మంత్రివర్గంలోకి తీసుకున్నారని, తనను కూడా అలాగే మంత్రిని చేయాలని కోరాడు. లేనిపక్షంలో వారిని కూడా పదవుల నుంచి తొలగించాలని సూచించారు. గతంలోనూ శివరాజ్ సింగ్ ఇలాగే ఐదుగురికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. మరోసారి కూడా సీఎం అలాంటి తప్పే చేస్తున్నారని మండిపడ్డారు. ఈ లేఖ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీఎం స్పందిస్తారా..? లేదా అనేది ఆసక్తిగా మారింది. కాగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ ఇలా పదవులు కట్టబెట్టడం పరిపాటిగా మారిపోయిన సంగతి తెలిసిందే.