నగరంలో కబ్జాలపై గవర్నర్‌కు బాధితుడి ట్వీట్‌ - MicTv.in - Telugu News
mictv telugu

నగరంలో కబ్జాలపై గవర్నర్‌కు బాధితుడి ట్వీట్‌

October 21, 2019

హైదరాబాద్ నగరంలో కబ్జా దారులు మళ్ళీ రెచ్చిపోతున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ స్థలాలను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో కబ్జాలపై ఓ సామాన్యుడు గవర్నర్‌కు ట్వీట్‌ చేశారు. అంబేద్కర్ నగర్ బస్తీకి చెందిన పి.శ్రీనివాసులు తనకు కేటాయించిన స్థలంతో పాటు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లోని స్థలాలను కొందరు కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రజా ప్రతినిధులకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశాడు. 

సర్కార్ స్థలాలను కొందరు లీడర్లు కబ్జా చేస్తున్నారని, తాను కూడా మోసపోయానని, తన స్థలాన్ని కూడా కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేశాడు. ఏ అధికారి వినిపించుకోలేదు. దీంతో కొత్తగా వచ్చిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ట్వీట్ చేశాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడం లేదని.. కనీసం మీరైనా స్పందించాలని ట్వీట్‌లో పేర్కొన్నాడు. తర్వాత గవర్నర్ కార్యాలయానికి ఫోన్ చేశాడు. దీంతో కార్యాలయ సిబ్బంది స్పందించి 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు వచ్చి కలవాల్సిందిగా అపాయింట్‌మెంట్ ఇచ్చారు.