అమెరికా ’డ్రీమర్స్’ కంపెనీల అండ.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా ’డ్రీమర్స్’ కంపెనీల అండ..

September 6, 2017

అమెరికా ‘డ్రీమర్స్’కు దిగ్గజ కంపెనీలు యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లు అండగా నిలిచాయి. వారిని అమెరికా నుంచి వెళ్లగొట్టే యత్నాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిన బూనాయి. తల్లిదండ్రులతోపాటు అమెరికాకు వచ్చిన పిల్లలను డ్రీమర్స్ అంటారు. వీరిని అక్రమ వలసదారులుగా ప్రకటిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడంతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ డ్రీమర్స్ సంఖ్య 8 లక్షలు. వీరిలో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో పలువురు యాపిల్, ఫేస్ బుక్ వంటి కంపెనీల్లో పనిచేస్తున్నారు. ట్రంప్ ఆదేశాల నేపథ్యలో వీరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అయితే వారిని కాపాడుకుంటామని కంపెనీలు ముందుకొచ్చాయి.

ట్రంప్ నిర్ణయాన్ని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తీవ్రంగా ఖండించారు. డ్రీమర్స్ కు అవసరమైన న్యాయ, వలస సంబంధ సాయం అందిస్తామని చెప్పారు. ఈ నిర్ణయం తమ ఉద్యోగులపై ప్రభావం చూపదని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ప్రకటించింది. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ లీగల్ ఆఫీసర్ బ్రాడ్ వెల్లడించారు. ట్రంప్ నిర్ణయాన్ని కాంగ్రెస్ సభ్యులందరూ వ్యతిరేకించాలని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ కోరారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఇలాగే కోరారు.