విశ్వక్ సేన్‌‌ను కఠినంగా శిక్షించాలి.. హైకోర్టులో లాయర్ ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

విశ్వక్ సేన్‌‌ను కఠినంగా శిక్షించాలి.. హైకోర్టులో లాయర్ ఫిర్యాదు

May 2, 2022

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌పై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రచారంలో భాగంగా విశ్వక్ సేన్ ఓ ప్రాంక్ వీడియో చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన కొందరు తీవ్రంగా ఆగ్రహించారు. సినిమా ప్రచారం పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించటం సరికాదని మండిపడుతున్నారు. మరికొంతమంది హీరోలు కూడా ఇలాంటి వీడియోలు చేస్తున్నారా? ఏంటీ ఈ న్యూసెన్స్ అని విశ్వక్ సేన్‌పై విరుచుకుపడుతున్నారు.

ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ”విశ్వక్ సేన్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలి. సినిమా పేరిట పబ్లిక్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేస్తున్నాడు. హీరోలు చేసే ఇలాంటి ప్రయత్నాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయి. యూట్యూబులోని ఇలాంటి వీడియోలన్నింటినీ తొలగించాలి. ఈ దిశగా కోర్టు పోలీసులకు ఆదేశాలివ్వాలని హెచ్.ఆర్.సి.ని కోరాం’అని తెలిపారు.

ఈ నెల 6న విడుదల కానున్న ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రబృందం హైదరాబాద్ నగరంలో ఓ రహదారిపై ప్రాంక్ వీడియో చేశారు. అందులో ఓ వ్యక్తి చనిపోతానంటూ బెదిరించడం కలకలం రేపింది. ఆ వీడియోను వీక్షించిన కొందరు షాక్‌కు గురవగా, మరికొందరు తీవ్రంగా మండిపడ్డారు.