Complete details about Congress President Mallikarjuna Kharge
mictv telugu

కాంగ్రెస్‌కు రెండో దళిత అధ్యక్షుడు.. గాంధీలకు విధేయుడు ఖర్గే ప్రస్థానం ఇలా

October 19, 2022

Complete details about Congress President Mallikarjuna Kharge

స్వతంత్రం రాక ముందు ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో దక్షిణాదికి చెందిన ప్రముఖ దళిత నేత మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. దీంతో ఆ పదవిని అలంకరించిన రెండో దళిత నాయకుడిగా రికార్డుల్లోకెక్కారు. ఇంతకు ముందు జగ్జీవన్ రామ్ మొదటి దళిత అధ్యక్షుడిగా పని చేశారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరుగాంచిన 80 ఏళ్ల ఖర్గేకు కాంగ్రెస్ పార్టీతో 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 1942 జులై 21న కర్ణాటకలోని బీదర్‌లో జన్మించిన ఖర్గే.. ప్రాథమిక విద్యాభాసం అనంతరం గుల్బర్గాలోని సేథ్ శంకర్ లాల్ లహోతి కాలేజీలో న్యాయవిద్య అభ్యసించారు.

ఆ సమయంలోనే అంటే 1969లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. జూనియర్ న్యాయవాదిగా ఉంటూ కార్మిక సంఘాల కేసులు గెలిచి ఫేమస్ అయ్యారు. అదే సమయంలో గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. అనంతరం 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తర్వాత 1973లో ఓక్ట్రోయ్ అబాలిషన్ కమిటీ బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలోని మున్సిపాలిటీ, స్థానిక సంస్థల బలోపేతానికి కీలక సూచనలు చేశారు. 1976లో ప్రాథమిక విద్యాశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 16 వేల ఎస్సీ, ఎస్టీ టీచర్ల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేశారు. తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు దేవరాజ్, గుండూరావు, ఎస్ఎం కృష్ణ హయాంలో వివిధ మంత్రి పదవులు అలంకరించారు. ఇక విజయాలకు మారుపేరుగా నిలిచిన ఖర్గే.. అన్ని ఎన్నికల్లో కలిపి 12 సార్లు పోటీ చేశారు. ఇందులో 11 సార్లు విజయం సాధించారు. ఒక్క 2019లో మాత్రమే ఓడిపోయారు. కర్ణాటక అసెంబ్లీకి వరుసగా 9 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. అటు ఎంపీగా మన్మోహన్ హయాంలో మంత్రి పదవి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక తొలి టర్మ్‌లో లోక్ సభలో పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2021 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికై తర్వాత పార్టీ అధ్యక్ష పదవి కోసం రాజీనామా చేశారు. అయితే గాంధీ కుటుంబానికి విధేయుడైన ఖర్గే.. వారి సూచనలు పాటిస్తారా? లేదా స్వతంత్రంగా ఉంటారా? అనేది భవిష్యత్తులో తేలనుంది.