టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఆవిర్భావ సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మంలో వంద ఎకరాల్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ సభలో పలువురు జాతీయ నేతలు పాల్గొంటున్నారు. ఈ సభ వివరాలను మంత్రి హరీశ్ రావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ అధ్యక్షుడు డి. రాజా, సీపీఎం తరపున కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లు ఒకే వేదికపై వస్తున్నారు. వీరు ఈ రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకోనుండగా, ప్రోటోకాల్ ప్రకారం మంత్రులు స్వాగతం పలుకుతారు.
బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ తో అల్పాహారం చేసి దేశ రాజకీయాలపై చర్చిస్తారు. అనంతరం యాదాద్రి వెళ్లి లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకొని రెండు హెలికాప్టర్ లలో ఖమ్మంకి బయల్దేరతారు. అక్కడ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొని రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన ఆరుగురికి ఈ నేతలు కంటి అద్దాలు పంపిణీ చేసి మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్ లలో హైదరాబాద్ చేరుకొని వారి వారి ప్రాంతాలకు జాతీయ నేతలు చేరుకుంటారు’ అని వెల్లడించారు.