కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్ మెంట్ కొత్త విధానం అయిన అగ్నిపథ్ ప్రోగ్రాంని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. దరిమిలా పోలీసులు హెచ్చరించినా వినకపోవడంతో చివరికి కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్లతో 15 రౌండ్లు కాల్పులు జరపడంతో నిర్మల్ జిల్లా వాసి ఒకరు మరణించారు. బుల్లెట్ తగలడంతో అతడు ప్లాట్ఫాం మీదనే కుప్పకూలిపోయాడు. మరి కొంతమందికి వీపు, కాళ్లు, చేతుల్లోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. దీంతో ఆందోళన కారులు చెల్లాచెదురయ్యారు. గాయపడ్డవారిని ఆందోళనకారులు ఆస్పత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాజా ఘటనతో రైల్వేస్టేషనుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
అంతకు ముందు ఆందోళన కారులు అజంతా, ఈస్ట్ కోస్ట్ రైళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ అన్ని రైళ్లను రద్దు చేశారు. ఇదిలా ఉండగా, ఆందోళనకారులు స్టేషన్ లోపలే కాకుండా బయట కూడా విధ్వంసం సృష్టించారు. 20 బైకులను తగులబెట్టి, ఓ ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. మరోవైపు రైల్వే జీఎం అత్యవసర భేటీ నిర్వహించారు. ఆస్తినష్టంతో పాటు ప్రయాణీకుల తరలింపుపై సమావేశంలో చర్చించారు. ఇదిలా ఉండగా, మొత్తం నష్టం 20 కోట్లుగా అంచనా వేస్తున్నారు. మొదటగా 500 మంది ఆందోళనకారులు వస్తారని భావించగా, ఆ సంఖ్య 2 నుంచి 3 వేల వరకు ఉంటుందని ఓ అంచనా. కాగా, ఈ సంఘటన వెనుక కాంగ్రెస్ విద్యార్ధి విభాగం ఎన్ఎస్యూఐ ఉందని ఆరోపణలు రాగా, వాటిని రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఖండించారు. ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.