తెలంగాణలో ఎవరు చనిపోయినా కరోనా టెస్ట్.. హైకోర్టు ఆదేశం
కరోనా మహమ్మారి కారణంగా రోజురోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. చివరికి చట్టాలను కూడా అదే శాసిస్తోంది. తెలంగాణలో చనిపోయినవారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. గతంలో ఎవరైనా చనిపోతే ఎలాంటి పరీక్షలు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. చనిపోయిన వారి మృతదేహాలకు పరీక్షలు చేయకపోతే.. కరోనా 3వ స్టేజికి వెళ్లే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వివిధ సంస్థలు ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించాలని పిటిషనర్ వాదించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిబంధనలు అనుసరిస్తుందో నివేదించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 26కు వాయిదా వేస్తూ.. ఈ నెల 26 వరకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.