ఏపీ ప్రభుత్వం, థియేటర్ ఓనర్ల మధ్య గొడవ.. మూసేస్తామని హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రభుత్వం, థియేటర్ ఓనర్ల మధ్య గొడవ.. మూసేస్తామని హెచ్చరిక

June 16, 2022

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్ అమ్మకాల విషయంలో వివాదం ప్రారంభమైంది. థియేటర్లలోని టిక్కెట్లను ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించగా, అందుకు సంబంధించిన జీవో 69ను ఈ నెల 2న జారీ చేసింది. అందులో థియేటర్ యజమానులు జులై 2 లోపు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవాలని ఆదేశించింది. లేకపోతే థియేటర్లను మూసేస్తామని అందులో పేర్కొంది. దీన్ని చూసిన థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు ఆందోళనకు గురయ్యారు. టిక్కెట్ల అమ్మకం వరకు ఓకే కానీ, ప్రభుత్వం థియేటర్లకు డబ్బులు చెల్లించడానికి నిర్దిష్ట సమయం పేర్కొనకపోవడంతో వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవోపై సంతకం చేస్తే ప్రభుత్వం చేతికి చిక్కినట్టేనని, దానికి వ్యతిరేకంగా థియేటర్లను మూసివేసేందుకు కూడా సిద్ధపడుతున్నారు. మరో మార్గంగా ఫిలిం ఛాంబర్ ద్వారానే టిక్కెట్లను విక్రయించి వాటి లింకును ప్రభుత్వానికి సమర్పిస్తామని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం పేర్కొంటూ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.