రాహుల్ గాంధీని బుక్ చేసిన బీజేపి - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ గాంధీని బుక్ చేసిన బీజేపి

December 13, 2017

గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడం కోసం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమీషన్ షాక్ ఇచ్చింది. ప్రచారం ముగిసిన తర్వాత కొన్ని టీవీ ఛానల్స్ కు రాహుల్ ఇంటర్య్యూ ఇచ్చారని, ఇది ఎన్నికల నియామళిని ఉల్లంఘించినట్టే అనిఈసికి బీజేపీ గుజరాత్ శాఖ ఫిర్యాదు చేసింది.దీనిపై స్పందించిన ఈసీ, ఎన్నికల చట్టంలోని సెక్షన్ 126 (1)(b)ను రాహుల్ ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా తేల్చింది. దీంతో ఈ నెల 18 తారీఖు సాయంత్రం ఐదింటి లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రాహుల్ కు నోటీసులు జారీ చేసింది.

మీడియాకు నోటీసులు

రాహుల్ ఇంటర్వ్యూను ప్రసారం చేసిన టీవీ ఛానల్స్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని గుజరాత్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ను కేంద్ర ఎన్నికల సంఘం  ఆదేశించింది.

చట్టానికి ఈసీ కొత్త నిర్వచనం

రాహుల్ గాంధీ కి నోటీసులు ఇచ్చిన ఎలక్షన్ కమీషన్ ఈ దేశంలో చట్టానికి కొత్త నిర్వచనం చెప్పిందని కాంగ్రెస్ విమర్శించింది. రాహుల్ ఇంటర్వ్యూ ప్రసారం చేసిన మీడియాకు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. అలా అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆర్థిక శాఖ అరుణ్ జైట్లి, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షాలకు కూడా నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రచారం ముగిసిన తర్వాత డిసెంబర్ 8న పార్టీ మ్యానిఫెస్టోను  జైట్లీ రిలీజ్ చేశారని, 9 తారీఖున నాలుగు సభల్లో మోడీ మాట్లాడారని, అమిత్ షా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని ఆరోపించింది. వీళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలంది.  

మీడియాను బెదిరిస్తున్నారు

మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, బీజేపీ గుజరాత్ ప్రెసిడెంట్ జీతూభాయిలపై కాంగ్రెస్ సీరియస్ అయింది. రాహుల్ ఇంటర్వ్యూను ప్రసారం చేయవద్దని మీడియా ఛానల్స్ ను బీజేపీనేతలు బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేత సుర్జేవాలా ఆరోపించారు.