ఏపీ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ను నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. పలు కేసుల్లో కేంద్రానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకే నజీర్కు గవర్నర్ పదవి లభించిందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు .2012వ సంవత్సరంలో దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ట్విటర్లో జైరాం రమేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు . ‘తీర్పులు ఉద్యోగాలను ప్రభావితం చేస్తాయి. పదవీ విరమణకు ముందు ఇచ్చే తీర్పులు.. పదవీ విరమణ తర్వాత ఉద్యోగాలను ఇస్తాయి.’ అని ఆ వీడియోలో అరుణ్ జైట్లీ అన్నారు. దేశంలో గత మూడు, నాలుగేళ్లుగా ఇదే జరుగుతుందని జైరాం రమేశ్ విమర్శించారు. దానికి ఈ నియామకాలే సరైన రుజువులు అని ఎద్దేవా చేశారు. ‘నాటి తీర్పులు వల్లే నేటి పదవులంటూ’ కేంద్రాన్ని విమర్శించారు.
మరోవైపు.. కేరళ సీపీఐ(ఎం) నేత, రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీమ్ కూడా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని గవర్నర్‌గా నియమించడం రాజ్యాంగ విలువలకు విఘాతం కలిగిస్తుందన్నారు. దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ‘గవర్నర్ పదవిని జస్టిస్ నజీర్ తిరస్కరించాలి. దేశ ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోకూడదు. మోదీ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలు భారత రాజ్యాంగానికి మచ్చను తెస్తున్నాయి. జస్టిస్ నజీర్ పదవీ విరమణ చేసిన ఆరు నెలలకే ఆయనకు గవర్నర్ పదవి వరించింది.” అని రహీం అన్నారు.
ఇక నజీర్ విషయానికొస్తే ఫిబ్రవరి 2017లో కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జీగా.. కేఎస్ పుట్టస్వామి కేసు, ట్రిపుల్ తలాక్ కేసు, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుమతిస్తూ తీర్పు, నోట్ల రద్దు కేసు వంటి ప్రముఖ తీర్పులలో భాగమయ్యారు. ఆర్టికల్ 19(2)లో లేని అదనపు పరిమితులను మంత్రులు మరియు ఎమ్మెల్యేలు వాక్ స్వాతంత్య్ర హక్కుపై విధించలేమన్న తీర్పులో కూడా ఆయన నాయకత్వం వహించారు.