మోదీ వెంట వచ్చిన బాక్స్‌లో ఏముంది?..ఈసీకి కాంగ్రెస్ ప్రశ్న - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ వెంట వచ్చిన బాక్స్‌లో ఏముంది?..ఈసీకి కాంగ్రెస్ ప్రశ్న

April 15, 2019

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తోంటే… ప్రధాని మోదీ ఛాపర్‌లో తరలించబడ్డ బాక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలోని చిత్రదుర్గలో బీజేపీ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సమయంలో తన హెలికాప్టర్‌లో తరలించబడ్డ పెద్ద బాక్స్‌లో ఏముందో ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. బాక్స్ ​మిస్టరీని ఛేదించాలంటూ కర్నాటక పీసీసీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కేపీసీసీ ప్రెసిడెంట్ దినేశ్ గుండూరావు శనివారం మీడియాకు విడుదల చేశారు.

ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌లో ఉన్న ఓ భారీ బ్లాక్ బాక్స్​ను సిబ్బంది కిందికి దించి కార్‌లో తరలించారు. ఈ బాక్స్​ ఎక్కడిది? అందులో ఏముంది? దానిని ఎక్కడికి పంపించారనే ప్రశ్నలకు ఎవరి వద్దా జవాబు లేదు. హెలికాఫ్టర్‌లో బాక్స్​ తీసుకెళుతున్న వివరాలు కూడా లేవు. ఈ అనుమానాస్పద పెట్టెలో ఏముందనేది తెలుసుకునేందుకు విచారణ జరిపించాలని కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల ప్రచారానికి వెళుతున్నపుడు కేంద్రమంత్రులు, ప్రధాని సహా ప్రజాప్రతినిధుల వాహనాలను తనిఖీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని గుర్తుచేశారు. అయితే, ప్రధాని వాహనాల విషయంలో ఈ రూల్ అమలు కావడంలేదని శర్మ విమర్శించారు. దేశ ప్రజల కోసం, ప్రధాని పదవి గౌరవాన్ని కాపాడటం కోసం సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆనంద్ శర్మ తెలిపారు.